అచ్చెన్న మండిపోతున్నారా..?

ఎన్నికల హడావుడి పెరిగిపోతున్నా అచ్చెన్న పాత్ర కనబడటమే లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు చర్చలు, సీట్లపై మంతనాల్లో అచ్చెన్నను పిలవటంలేదట.;

Advertisement
Update:2024-01-22 10:53 IST
అచ్చెన్న మండిపోతున్నారా..?
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే చంద్రబాబు అనే సమాధానం చెబుతారు. అయితే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడని, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడన్న విషయం చాలామంది మరచిపోయారు. ఎందుకంటే.. పరిస్థితులు అలా మారిపోయాయి కాబట్టే. మామూలుగానే చంద్రబాబుకు ప్రచారపిచ్చి విపరీతం. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తపన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పిచ్చి దెబ్బకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటే. అందుకనే అచ్చెన్న పెద్దగా కనబడటంలేదు. కొంత కాలంగా అచ్చెన్న పరస్థితి మరీ దయనీయంగా తయారైందని సమాచారం.

మీడియా సమావేశాలు ఇష్టప్రకారం పెట్టుకునేందుకు లేదట. అలాగే గవర్నర్ ను కలవటంలోనూ, ప్రభుత్వ ముఖ్యలకు లేఖలు రాయటంలో కూడా అచ్చెన్నను చంద్రబాబు పక్కనపెట్టేశారట. అచ్చెన్న పేరుమీద జరగాల్సిన వ్యవహారాల్లో దాదాపు మరో సీనియర్ నేత వర్ల రామయ్య మీదుగా జరిపించేస్తున్నారట. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మాత్రం అచ్చెన్నకు మీడియా అటెన్షన్ దొరికింది. జైలు నుండి విడుదల అయిన దగ్గర నుండి అచ్చెన్న మళ్ళీ డార్కులోకి వెళ్ళిపోయారట.

ఎన్నికల హడావుడి పెరిగిపోతున్నా అచ్చెన్న పాత్ర కనబడటమే లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు చర్చలు, సీట్లపై మంతనాల్లో అచ్చెన్నను పిలవటంలేదట. చంద్రబాబు, లోకేష్ మాత్రమే పవన్ తో భేటీ అవుతున్నారు. రెండుపార్టీల సమన్వయకర్తల సమావేశంలో అచ్చెన్న కనబడినా మొత్తం వ్యవహారమంతా సీనియర్ తమ్ముడు యనమల రామకృష్ణుడే లీడ్ పార్ట్ తీసుకున్నారు. మీడియా సమావేశాల్లో చంద్రబాబు పక్కన కొన్నిసార్లు మాత్రమే అచ్చెన్న కనబడుతున్నారు. పైగా అచ్చెన్న బద్ధ వ్యతిరేకి శ్రీకాకుళం ఎంపీ, అచ్చెన్న అన్న కొడుకు కింజరాపు రామ్మోహన్ నాయుడును బాగా ఎంకరేజ్ చేస్తున్నారట.

పార్టీలోని యుతనేతలతో జరిపిన సమావేశాల్లో కూడా లోకేష్, రామ్మోహన్ తప్ప అచ్చెన్న కనబడటంలేదట. అచ్చెన్నతో కన్నా లోకేష్ ఎక్కువగా మరో సీనియర్ తమ్ముడు కళావెంకటరావుతోనే టచ్ లో ఉంటున్నట్లు పార్టీవర్గాల టాక్. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వటం కోసమే చంద్రబాబు అప్పట్లో అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని అందరికీ తెలిసిందే. బీసీ కాకపోయుంటే అచ్చెన్నను చంద్రబాబు అసలు పట్టించుకునే వారే కాదు. స్వతహాగా ఉన్న దూకుడు స్వభావమే అచ్చెన్నకు పెద్ద మైనస్ అయినట్లు అర్థ‌మవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News