అంతకు మించి.. టీడీపీ కొత్త నిరసన ఏంటో తెలిస్తే షాక్..
ఈ లిస్ట్ లోకి కొత్త నిరసన ఒకటి చేర్చారు నారా లోకేష్. 'న్యాయానికి సంకెళ్లు' అంటూ దానికి కొత్త పేరు పెట్టారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ చిత్ర విచిత్రమైన పేర్లతో నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. విజిల్స్ వేశారు, వాహనాల హారన్లు కొట్టారు, పళ్లాలను గరిటెలతో వాయించారు, గంట కొట్టారు, డోలు కొట్టారు, లైట్లు ఆపేసి క్యాండిల్స్ వెలిగించారు, చివరకు మెట్రో రైళ్లలో నల్లటి దుస్తుల్లో ప్రయాణించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కొత్త నిరసన ఒకటి చేర్చారు నారా లోకేష్. 'న్యాయానికి సంకెళ్లు' అంటూ దానికి కొత్త పేరు పెట్టారు. తమకి తామే సంకెళ్లు వేసుకుని ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని టీడీపీ సానుభూతిపరులకు పిలుపునిచ్చారు లోకేష్.
మిమ్మల్ని మీరే బంధించుకోండి..
"చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఈనెల 15 (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకొని నిరసన తెలియజేయాలి" అని ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లు అంటూ నినాదాలు చేయాలని కోరారు. చేతికి తాళ్లు, రిబ్బన్లు కట్టుకున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను, అభిమానులను కోరారు.
ఇదెక్కడి నిరసన..?
అసలు ఈ నిరసన ప్రదర్శనలు ఎందుకోసం..? చంద్రబాబు జైలులో ఉంటే బయట జనం నిరసనలు చేస్తే ఫలితం ఏంటి..? న్యాయపోరాటం చేయాల్సిన సందర్భంలో నిరసనలంటూ జనాల్ని రోడ్లపైకి రావాలని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి..? ఈ నిరసనలు, చిత్ర విచిత్రమైన విన్యాసాలతో ఉపయోగం లేకపోగా.. టీడీపీ నేతలు నవ్వులపాలవుతున్నారు. కొన్నిచోట్ల ఈ నిరసనలు సాంస్కృతిక కార్యక్రమాలుగా మారిపోతున్నాయి, బాధపడుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ.. సంతోషంగా పండగ వాతావరణంలో సాగుతున్నాయి. ఇంతకీ చంద్రబాబు జైలుకెళ్లినందుకు టీడీపీ వాళ్లు బాధపడుతున్నారా, లేక సంతోషంతో డ్యాన్స్ లు వేస్తున్నారా అంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. చివరిగా ఈ సంకెళ్ల సీన్ ఎన్ని ట్రోలింగ్ లను ఆహ్వానిస్తుందో చూడాలి.