కురుక్షేత్రం.. కౌరవులు, తోడేళ్లు

చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్నారు, దత్తపుత్రుడు అంటూ పవన్ పై రెగ్యులర్ డైలాగ్ విసిరి సరిపెట్టారు. కాకినాడ సభలో లాగా ఘాటు విమర్శల జోలికి వెళ్లలేదు సీఎం జగన్.

Advertisement
Update:2023-10-19 14:04 IST

జరగబోయేది క్లాస్ వార్ అంటూ మరోసారి ఉద్ఘాటించారు ఏపీ సీఎం జగన్. జరగబోయే కురుక్షేత్రంలో కౌరవులంతా ఏకమవుతున్నారని, తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని మండిపడ్డారు. తనకు మాత్రం ప్రజలు, దేవుడు తోడు ఉన్నారని, మీరంతా సైనికులై నాతో కలసి నడవాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారులకు ఆయన నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు.


Full View

అప్పుడు-ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌ అని.. మారిందల్లా ముఖ్యమంత్రేనని చెప్పారు సీఎం జగన్. అప్పట్లో గజదొంగల ముఠా ప్రజల సొమ్ము దోచుకుందని, ఇప్పుడు మీ బిడ్డ నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాడని చెప్పారు. ఎక్కడా ఎవరూ లంచాలు అడగడం లేదని, వివక్ష చూపడం లేదని, ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇళ్ల స్థలాలు ప్రజలకు ఇవ్వలేదని, కానీ తన హయాంలో అక్కడ 20వేల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని చెప్పారు జగన్.

స్కామ్ ల ప్రభుత్వం..

గత ప్రభుత్వ హయంలో అన్నీ స్కామ్ లేనని చెప్పారు సీఎం జగన్. రూ.87, 012 వేల కోట్లు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సున్నావడ్డీ పథకం ఎత్తేశారని, బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడిపోయాయని, రుణమాఫీ రూ. 5వేల కోట్లు కూడా చేయలేదని, స్కిల్‌ స్కామ్‌, ఫైబర్‌ నెట్‌ స్కామ్‌, చివరకు మద్యం కొనుగోళ్లలో కూడా దోచేశారని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకుని, చివరకు నిరుద్యోగుల్ని కూడా మోసం చేశారన్నారు. అన్నింటా చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని చెప్పారు.

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.. అంటూ అన్ని వర్గాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేశారు సీఎం జగన్. క్లాస్ వార్ లో పేదలంతా తనవైపే ఉన్నారని, పెత్తందార్లతో యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. ఈసారి మాత్రం వ్యక్తిగత విమర్శలకు జగన్ ప్రాధాన్యమివ్వలేదు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్నారు, దత్తపుత్రుడు అంటూ పవన్ పై రెగ్యులర్ డైలాగ్ విసిరి సరిపెట్టారు. కాకినాడ సభలో లాగా ఘాటు విమర్శల జోలికి వెళ్లలేదు సీఎం జగన్.


Tags:    
Advertisement

Similar News