చతుర్ముఖ వ్యూహంతో విజయం మాదే –రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు, 72 అసెంబ్లీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. బీజేపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందన్నారు.

Advertisement
Update:2023-03-09 07:07 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ వ్యూహం అమలు చేస్తామంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాథ్ సే హాథ్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులు ఏకమవుతున్నాయని, అన్నిచోట్లా కాంగ్రెస్ కి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కనీసం 72 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.

పాలసీ(P), క్యాలిక్యులేషన్(C), కమ్యూనికేషన్(C), ఎగ్జిక్యూషన్‌(E).. PCCE అనే చతుర్ముఖ వ్యూహంతో తాము ముందుకెళ్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును తాను క్యాజువల్‌ గా తీసుకోలేదని, చాలా క్యాలిక్యులేటెడ్‌ గా చేశామని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రావాలన్నా 80లక్షల ఓట్లు అవసరమని అన్నారు. కాంగ్రెస్ లో 43 లక్షల మంది సభ్యులుగా చేరారని, పార్టీ సానుభూతిపరులు, పార్టీకి ఓటు వేయాలనుకునే సామాన్య ప్రజలు వీరికి అదనం అన్నారు. ఈసారి తమ లెక్క తప్పదని, అత్యధిక మెంబర్షిప్ తో ఉన్న తమ పార్టీ కచ్చితంగా విజయంసాధిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ తో పోటీ పడే ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ... ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడతాయని, లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలకు ఫిరాయింపులే ప్రధాన టాస్క్ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ గురించి మాట్లాడేవారు కాదని, హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రల తర్వాత పరిస్థితి మారిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు తమపై కూడా ఫోకస్ పెట్టారన్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు, 72 అసెంబ్లీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. బీజేపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై తమ అంచనాలు తమకున్నాయని చెప్పారు. 50 శాతానికిపైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశామని చాలా చోట్ల పొటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉందన్నారు. 60మందికి పైగా నేతల పేర్లు ప్రకటించడమే బ్యాలెన్స్ ఉందన్నారు. వారంతా కార్యక్షేత్రంలో దూకడానికి రెడీగా ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News