మాదిగ అమరవీరులకు కుటుంబాలకు ఐదు లక్షల ఆర్ధిక సాయం
జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణతో నూతన అధ్యాయనం రాయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు మంత్రి దామోదర, నాయకులు కడిగారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున మంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయని అన్నారు. హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందని, జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని వెల్లడించారు.
ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిదన్నారు. హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయ రంగు పూయకూడదని, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వర్గీకరణ విషయంలో అదే జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుకూలంగా, దళిత వర్గాలకు న్యాయం చేసేలా అన్ని విధాల అధ్యయనం చేసిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.