అనర్హత పిటిషన్‌పై సుప్రీం ఏం చెబుతుందో?
రీజనబుల్ టైం పై అత్యున్నత న్యాయస్థానం ఏం తేల్చబోతున్నదనే ఉత్కంఠ
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ బీఆర్ గవాయి, వినోదన్ చంద్రన్ ధర్మానసం దీనిపై కీలక విచారణ చేపట్టనున్నది. ఈ అంశంపై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరగగా.. స్పీకర్ ఎలాంటి సమాచారం ఇవ్వకపోడంతో వాయిదా వేసింది. కానీ ఈసారి కచ్చితంగా సుప్రీంకోర్టు దీనిపై ఏదో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు రెండుసార్లు విచారణ సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఎంత? అని ఒకే ప్రశ్నఅడుగుతున్నది. దీనిపై స్పీకర్‌ను అడిగి చెబుతామని స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాయిదా కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు ఎలాంటి వాదనలతో వస్తారనేది ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేస్తుందా? లేదంటే నేరుగా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉన్నది.
మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలతో 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పాలని మరోసారి సుప్రీంకోర్టు కోరింది. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అని బీఆర్‌ఎస్ చెబుతున్నది. పార్టీ మారిన వారిపై వేటు వేయాయాల్సిందేనని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నది. బీఆర్‌ఎస్ టికెట్ పై గెలిచిన కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయని సన్నద్ధంగా ఉండాలని నేతలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి మినహా మిగిలిన వాళ్లు ఎవరూ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎక్కడా చెప్పడం లేదు.
ఇక ప్రభుత్వ ఏడాది పాలనపై వ్యతిరేకతకు తోడు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై సొంతపార్టీ నేతల విమర్శలతోనే అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. సుప్రీంకోర్టు ఈ అంశంపై రీజనబుల్ టైం పదే పదే ప్రశ్నిస్తుండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆత్మరక్షణలో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో వచ్చిన వారికి కండువా కప్పారు. కానీ ఇప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నిన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయో దేవుడికి తెలుసు అని వ్యంగ్యంగా మాట్లాడారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం అసంబద్ధ వాదనలు ముందుకు తెచ్చారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటములతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. నరేందర్ రెడ్డి ఓడినా, గెలిచినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అన్నట్టు మాట్లాడటంపై పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. సీఎం వ్యవహారంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నమ్మించి మోసం చేశారని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం.