కాంగ్రెస్‌లో కులగణన కాక
పార్టీలో బీసీలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేశామని చెప్పుకుంటున్న కులగణనపై విపక్షాలు, బీసీ సంఘాలే కాదు ఆ పార్టీ సొంత నేతలే తప్పుపడుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిన్న మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కులగణన తప్పుల తడక అని ధ్వజమెత్తారు. అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. పార్టీలో బీసీలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భజన సంఘాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి దగ్గర భజనగాళ్లు చేరి పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కులగణన నివేదికను తగులపెట్టాలని అసభ్య పదజాలంతో మల్లన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. దీనికి స్పందించేలది లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. అయితే మల్లన్న విషయాన్ని పక్కనపెడితే అంజన్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. హైదరాబాద్‌లో బలమైన నేతగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన నివేదికపై బీసీ నేతల భేటీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో యాదవుల మీటింగ్ జరిగింది. ఇందులో అంజన్‌కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్లు ఓడిపోయినప్పటికీ తిరిగి సీట్లు తెచ్చుకుంటున్నారు. కానీ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తమ లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ విషయంలో తాను త్యాగం చేశానని, కానీ బైటి పార్టీ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ టికెట్ యాదవులకు ఇచ్చి ఉంటే గెలిచి ఉండేదని యాదవుల మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతున్నది.