భారత్ గెలువాలంటే బీజేపీకి, పాకిస్థాన్ గెలువాలంటే కాంగ్రెస్‌కు ఓటువేయండి
భారత్ గెలువాలంటే మాకు, పాకిస్థాన్ గెలువాలంటే కాంగ్రెస్ క ఓటు వేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా, పాకిస్థాన్ పొలిటికల్ మ్యాచ్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 27 తేదీన మరో మ్యాచ్ జరగబోతున్నది. మాది (బీజేపీ) భారత జట్టు, వాళ్లది (కాంగ్రెస్) పాకిస్థాన్ టీమ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా టీమ్ అయిన మాకు ఓటు వేస్తేనే గెలుస్తామని దీనిపై ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు. పాకిస్థాన్ గెలువాలనుకుంటే వాళ్లకు ఓటు వేయాలన్నారు. ఎవరు మీ ఆశలను, ఆశయాలను నెరవేరుస్తారో ఆలోచించుకుని ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 27న జరిగే పొలిటికల్ మ్యాచ్‌లోనూ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడానికి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు ఒక కేంద్ర మంత్రి అన్న విషయాన్ని మరిచిపోయి ఈ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతారా అని మండిపడ్డారు. ఈ విధంగా పట్టభద్రుల ఓట్లు సంపాదించుకోవాలనే మీ ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తున్నదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం తప్పు అన్నారు. తప్పకుండా సంజయ్‌పై కేసు ఫైల్ చేస్తామన్నారు.పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా దీనిపై స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌తో ముడిపెట్టడం సంజయ్‌కి సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో మాట్లాడితే మంచిదని సూచించారు.