షర్మిల పార్టీలోకి పొంగులేటి.. ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement
Update:2023-02-05 09:05 IST

ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిత్యం ఇప్పుడు సందిగ్దంలో పడింది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఇటీవల ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, 24 గంటల కరెంటు కూడా రావడం లేదని ఆరోపించారు. దానికి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు కూడా కౌంటర్ ఇచ్చారు. గత కొంత కాలంగా సొంత పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి.. రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయంలో బాధ్యతను సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారు. కాంగ్రెస్‌లో చేరడంపై ఇంకా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆయన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)లో చేరతారని ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన మన పార్టీ తరపునే పోటీ చేస్తారంటూ కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు.

గతంలోనే పొంగులేటి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసి ఈ విషయాలు చర్చించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా శనివారం నాడు షర్మిలకు అండగా ఉంటున్న తల్లి విజయమ్మను శ్రీనివాసరెడ్డి కలిశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా.. అదే పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో శ్రీనివాస్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షర్మిలను కలిసినప్పుడు 'ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని' చెప్పారంట. అంటే తాను వైఎస్ఆర్టీపీలోకి వస్తాననే చెప్పకనే చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ నెల 8న పాలేరులో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వైఎస్ విజయమ్మ కూడా హాజరు కానున్నారు. అదే రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు షర్మిల పార్టీకి ఆమె తప్ప వేరే పాపులర్ నాయకులు ఎవరూ లేరు. పొంగులేటి రాకతో పార్టీకి మంచి ఉత్సాహం వస్తుందని ఆమె భావిస్తున్నారు. కార్యకర్తల బలంతో పాటు ఆర్థిక బలం కూడా ఉన్న పొంగులేటి వంటి నాయకులు పార్టీకి ప్లస్‌గా మారతారని షర్మిల, విజయమ్మ అంచనా వేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో పొంగులేటీ ఎంపీగా పోటీ చేస్తారా? లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్టీపీ తరపున భారీగా ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతలు మాత్రం తీసుకుంటారని మాటిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇల్లెందు, పినపాక, మధిరలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిన పొంగులేటి.. తన బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. తనను పక్కన పెట్టిన బీఆర్ఎస్ నాయకులకు సత్తా తెలియజేయాలని పొంగులేటి భావిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News