కన్నీరు పెట్టుకున్న రైతులు.. ధైర్యం చెప్పిన కేసీఆర్

తమ పొలాలను చూపిస్తూ రైతులు భోరుమన్నారు. రైతులే కాదు, కేసీఆర్ వస్తున్నారని తెలిసి వివిధ వర్గాల ప్రజలు వినతిపత్రాలతో అక్కడకు వచ్చారు.

Advertisement
Update:2024-03-31 14:32 IST

కేసీఆర్ పొలంబాట యాత్ర సందడిగా మొదలైంది. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన ఆయన మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. జనగాం జిల్లా దేవరుప్పల గ్రామం దరావత్ తండాలో రైతులను కలిశారు కేసీఆర్. నేరుగా వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసీఆర్ ని చూసి కంట తడి పెట్టుకున్నారు. వారిని కేసీఆర్ ఓదార్చారు. తానున్నానంటూ ధైర్యం చెప్పారు.


కేసీఆర్ ప్రత్యేక బస్సులో పొలంబాట యాత్రకు బయలుదేరారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు కూడా బస్సులో జిల్లాల యాత్రకు వచ్చారు. ముందుగా దరావత్ తండాలో రైతులు ఎండిపోయిన పంట పొలాల వద్ద ఆగి వారిని పరామర్శించారు కేసీఆర్. తమ పొలాలను చూపిస్తూ రైతులు భోరుమన్నారు. రైతులే కాదు, కేసీఆర్ వస్తున్నారని తెలిసి వివిధ వర్గాల ప్రజలు వినతిపత్రాలతో అక్కడకు వచ్చారు.

బస్సు ఆపి తమ కష్టాలు చెప్పుకున్న ఓ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు కేసీఆర్. తనతో బాధలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన భరోసా ఇచ్చారు. వారికి అండగా నిలబడతామన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే వరకు వారి తరపున తాము పోరాటం చేస్తామన్నారు. గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకు వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, చెప్పారు. తమ ప్రభుత్వం రైతు సమస్యలపై వెంటనే స్పందించేదని గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News