కాంగ్రెస్‌లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన
తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు;
తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలని ఆ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు సమావేశమయ్యారు.ఈ భేటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని ప్రభుత్వ నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
కులగణనపై కృతజ్ఞత సభ పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. కులగణన సరిగ్గా చేయలేదని పలువురు మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు వ్యాఖ్యానించారు. మన సామాజిక వర్గం సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు. మంత్రివర్గంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మున్నూరు కాపుల సభను నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.