కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడి;
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీపీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీఫిబ్రవరి 5న ఇచ్చిన పార్టీ వ్యతిరేక చర్యలపై 12లోగా వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చింది. గడువులోపు వివరణ ఇవ్వకపోగా పార్టీపై అదే పనిగా విమర్శలు చేస్తుండటంతో క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్వర్వులు వెలువరించారు.
వరంగల్ సభలో కులగణనకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆ నివేదికను అసభ్యపదజాలం ఉపయోగించి తగులబెట్టాలని పిలుపునిచ్చాడు. అది కులగణన కాదని, జానారెడ్డి చెప్పిన ప్రకారం జరిగిన కులగణన అని ఆరోపించారు. సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను మల్లన్న దగ్ధం చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. అదే పనిగా పార్టీ వ్యతిరేకంగా విమర్శలు చేస్తుండటంతోపాటు కులగణనపై పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు స్పందిస్తూ మల్లన్న పార్టీలో ఉండాలంటే పార్టీ లైన్ లోనే మాట్లాడాలని లేకపోతే వెళ్లిపోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి మల్లన్న కు నోటీసులు జారీ చేశారు. అయితే నాకు ఏ నోటీసులు రాలేదని, వచ్చినా ఇవ్వను అన్నట్లు మాట్లాడారు. అంతేకాదు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన సందర్భంగా అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను అక్కడికి ఎందుకు పంపించారు. మొత్తం కామెడీ చేస్తున్నారని, ఆయనను వేరే పనికి పురమాయించాలని సీఎంను కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీ నేతలపై, పార్టీ విధానాలను తప్పుపడుతున్న మల్లన్నపై ఎట్టకేలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది.