టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం
మీడియాలో ప్రసారం అవుతున్నది తప్పుడు ప్రచారం : నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్;
ఎస్‌ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ తెలిపారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిపై మీడియాలో ప్రసారమవుతున్న కథనాలు తప్పుడు ప్రచారమని ఆయన ఒక ప్రకటనలో కొట్టిపడేశారు. శుక్రవారం సాయంత్రం జేపీ అసోసియేట్స్ బేస్ క్యాంప్ లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి సుఖేందు, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి సీఎండీ బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో ఆయన రెస్క్యూ ఆపరేషన్ పై సమీక్షించారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది, ఆక్సీజన్ అందుబాటులో ఉంచామని తెలిపారు. టన్నెల్‌లో ఆర్మీ, నేవి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్ బృందాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయని అన్నారు. శిథిలాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్‌ల సహాయంతో కట్ చేసి తొలగిస్తున్నారని, వీలైనంత త్వరగా కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి తెస్తామన్నారు. బురదను తొలగించేందుకు ఎస్కవేటర్లను సిద్ధం చేశామన్నారు. స్పెషల్ కెమెరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు.