ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్‌ఎల్బీసీ ప్రమాదం
పాలమూరు ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత;
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్‌ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఆఫీస్‌లో పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సొరంగంలో ఎనిమిది మంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతంటే మంత్రులు, నాయకులు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లారని.. ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ఘటన స్థలం దగ్గర లేరంటే వారికి ప్రాణాలంటే లెక్కలేదని అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 11.50 కి.మీ.ల మేర టన్నెల్ తవ్వినా ఒక్క ప్రమాదం జరలేదన్నారు. మట్టి, రాళ్లు పడుతున్నాయని కార్మికులు చెప్పినా వినకుండా ప్రభుత్వమే వారితో పని చేయించిందని.. ఫలితంగానే ఇంతటి భారీ ప్రమాదం జరిగిందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలను పూర్తి చేసి కేసీఆర్ లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. పాలమూరు - డిండి ఎత్తిపోతల పనులు కేసీఆర్ హయాంలోనే 60 శాతానికి పైగా పూర్తయ్యాయన్నారు. నార్లాపూర్ పంపుహౌస్ ను కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేస్తే రోజుకు టీఎంసీ చొప్పున ఎత్తిపోయవచ్చన్నారు. 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులో తట్ట మట్టి కూడా తీయలేదన్నారు.
కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం పేరుతో పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతోందన్నారు. భీమా నుంచి ఎత్తిపోసే నీళ్లతో కాకుండా నేరుగా జూరాల నుంచే కొత్త ఎత్తిపోతల పథకం చేపడితే మంచిదని ఇంజనీర్లు చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎరువుల కొరత లేదని.. ఇప్పుడు ఎందుకు యూరియా కొరత తలెత్తిందో చెప్పాలన్నారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్ కరెంట్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే హాస్టళ్లలో మన బిడ్డలు చనిపోవడం మొదలైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం పేదలను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పెద్దవాళ్లకే మేలు చేస్తూ ప్రజలను విస్మరిస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక, కుల సర్వే వివరాలను గ్రామాల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.