ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా..?

పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని విమర్శించారు హరీష్ రావు.

Advertisement
Update: 2024-07-04 09:34 GMT

తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారాయన. కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని, వారికి అన్నదాతల కష్టాలు పట్టడం లేదన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ హరీష్ రావు ట్వీట్ వేశారు.


ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ రైతు తన పొలాన్ని కాంగ్రెస్ నేతలు ధ్వంసం చేశారంటూ పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలారు. సీఎం సొంత జిల్లాకు చెందిన మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండాకు చెందిన మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. పట్టెడన్నం పెట్టే అన్నదాత ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం దురదృష్టకరం అని అన్నారు హరీష్ రావు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం అని అన్నారాయన.

పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని విమర్శించారు హరీష్ రావు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగుల సమస్యలపై కూడా బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కో సమస్యను హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News