ఫార్ములా - ఈ కేసు ఓ లొట్టపీసు

ఒక్కపైసా అవినీతి జరగలేదు.. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ తప్పు : మీడియా చిట్‌ చాట్‌లో కేటీఆర్‌

Advertisement
Update:2025-01-01 17:13 IST

ఫార్ములా - ఈ కేసు ఓ లొట్టపీసు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌ లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఫార్ములా - ఈ వ్యవహారంలో ఒక్కపైసా అవినీతి జరగలేదని.. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ తప్పు అన్నారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ కేసులో హైకోర్టు తీర్పు ఏం వస్తుందో చూద్దామన్నారు. రేవంత్‌ రెడ్డి తనను అరెస్టు చేయించడానికి ఏడాది కాలంలో ఇది ఆరో ప్రయత్నమని.. అయినా ఆయనకు ఏమీ దొరకడం లేదన్నారు. హైకోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు అడ్వొకేట్‌ జనరల్‌ దగ్గర సమాధానమే లేదన్నారు. తనపై కేసు పెడితే సీఎం రేవంత్‌ రెడ్డిపైనా కేసు పెట్టాల్సిందేనన్నారు. ఫార్ములా - ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఫార్ములా-ఈ రేసుకు తాను మంత్రిగా అనుమతిస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారు. నేను తప్పు చేస్తే రేవంత్‌రెడ్డి చేసింది ఎలా ఒప్పు అవుతుందని ప్రశ్నించారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్‌ మోసం చేస్తోందన్నారు.

రైతు భరోసా అమలు మొదలయ్యాక రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ ట్రంప్‌ కార్డు అని.. ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖజానాకు నష్టం చేస్తోందన్నారు. ఖాజాగూడలోని భూములపై కన్నేసి పేదలను రోడ్డుపాలు చేశారన్నారు. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1.38 లక్షల కోట్లు అప్పు చేసి అందులోంచి ఢిల్లీకి రూ.వేల కోట్లు పంపుతున్నారని తెలిపారు. దిల్‌ రాజు బ్యానర్‌లో రెండు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయని, ఆయన బాధ ఆయనకు ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. ఎండాకాలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్‌ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, కేసీఆర్‌ ను పార్టీ అధ్యక్షుడిగా తానే ప్రతిపాదిస్తానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News