అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు;
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించి సభాపతి జగదీష్ రెడ్డిని ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఆయన బయటకు పంపాలని మార్షల్‌ను స్పీకర్ ప్రసాద్ ఆదేశించారు.
తొలుత జగదీశ్‌రెడ్డి సభాపతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని అన్నారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్ తెలిపారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ను దూషించేలా ఆయన మాట్లాడారని సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.