కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఎన్నికల కమిషన్ కు పోటాపోటీ ఫిర్యాదులు
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ఎన్నికల ప్రచారం నుంచి తొలగించాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎన్నికల కమిషన్ సీఈవోకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో ఫిర్యాదుల పర్వానికి తెరలేచింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన మొదలుకాగా.. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఎన్నికల ప్రచార ప్రకటనలపై ఈ ఫిర్యాదులు అందడం విశేషం. గతంలో ఆయా పార్టీల గొప్పలు చెప్పుకునేలా ప్రకటనలు ఉండేవి, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు మరీ శృతి మించాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో ఈ పంచాయితీ ఈసీ వరకు చేరింది.
ఈసీని కలసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వికాస్ రాజ్ ను బీఆర్‌ఎస్ లీగల్ టీం కలిసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ ను కించపరిచే విధంగా కాంగ్రెస్ ఇస్తున్న ప్రకటనలను వెంటనే ఆపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దుబ్బాక, అచ్చంపేటలో జరిగిన దాడి ఘటనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు బీఆర్ఎస్ నేతలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ఎన్నికల ప్రచారం నుంచి తొలగించాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎన్నికల కమిషన్ సీఈవోకు ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ ఫిర్యాదులు..
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడిపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన అఫిడవిట్ పై అభ్యంతరం తెలిపారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారా, లేదా అనే విషయంపై క్లారిటీ లేదన్నారు. ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు తాము అన్ని ప్రకటనలకు ఈసీ అనుమతి తీసుకున్నామని కాంగ్రెస్ నేతలంటున్నారు. యాడ్స్ నిలిపివేసే విషయంలో పార్టీకి నోటీసులివ్వకుండా నేరుగా టీవీ ఛానెళ్లకు నోటీసులిచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థులను, కార్యకర్తలకు బెదిరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.