మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ తరగతులు..

ఈనెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు నాందేడ్ లో శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరానికి స్వయంగా సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం.

Advertisement
Update:2023-05-15 09:37 IST

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిన తర్వాత మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలోనే అత్యథిక సభలు నిర్వహించారు, చేరికలు కూడా అక్కడినుంచే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు నాందేడ్ లో శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరానికి స్వయంగా సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం.

ఏమేం చెబుతారు..?

మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులు, మేధావులు, కళాకారులు.. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ లో చేరారు. హైదరాబాద్ కి వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని, తెలంగాణ విజయాలను అక్కడ ప్రచారం చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. తాజాగా వారి ప్రాంతంలోనే నాయకులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

నాందేడ్‌ లో నిర్వహించే శిక్షణ తరగతులకు 1,000 మంది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని మహారాష్ట్ర బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. వారందరికీ రెండు రోజులపాటు నాందేడ్‌ లోనే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు

రెండు రోజుల శిక్షణ సందర్భంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాలను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కమిటీలను ఏర్పాటుచేసి జిల్లాలవారీగా బాధ్యులను నియమించబోతున్నారు. శిక్షణ శిబిరం ముగిసిన తర్వాత నెల రోజులపాటు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యత్వ నమోదు కూడా మొదలవుతుంది. బూత్ లెవల్ నుంచి స్టేట్ లెవల్ వరకు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రణాళిక రూపొందించింది.



వలసలు కంటిన్యూ..

మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. దివంగత విలాస్ రావు దేశ్‌ ముఖ్‌ బంధువు సచిన్‌ దేశ్‌ ముఖ్‌.. తాజాగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆయనతోపాటు వచ్చిన మరో 60మందిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. సచిన్ దేశ్ ముఖ్, ఆయన అనుచరుల చేరికతో లాతూర్ ప్రాంతంలో బీఆర్ఎస్ బలపడుతుందని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News