కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చేరిక ఎప్పుడంటే..?

మిగతా నాయకులంతా స్థానిక నేతలు, ఇన్ చార్జ్ ల సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లగా.. వెంకట్రావు మాత్రం రాహుల్ గాంధీ రాకకోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement
Update:2024-04-03 06:13 IST

బీఆర్ఎస్ నేతలు అటు బీజేపీలోకి, ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా.. పలువురు ఎమ్మెల్యేలు అనధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఈ క్రమంలో ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల కుటుంబంతో సహా ఆయన ముఖ్యమంత్రిని కలవడంతో కాంగ్రెస్ లో చేరిక ఖరారైంది అనుకున్నారంతా. అయితే కండువా పండగ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 12న మణుగూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సభకు కూడా వెంకట్రావు హాజరయ్యారు. ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్‌ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్‌ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా ఈనెల 6న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.

ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ మేనిఫెస్టో సభలో రాహుల్‌ గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు హస్తం పార్టీలో చేరతారు. మిగతా నాయకులంతా స్థానిక నేతలు, ఇన్ చార్జ్ ల సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లగా.. వెంకట్రావు మాత్రం రాహుల్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సభలో ఆయన ఒక్కరే కాంగ్రెస్ లో చేరతారా..? మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉత్సాహంగా ఉన్నారా..? అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News