రాజస్థాన్‌కు కొత్త సీఎం.. గెహ్లాత్‌కే ఏఐసీసీ పీఠం..?

ఎన్నికలతో భేదాభిప్రాయాలు రావడం కంటే.. ముందుగానే అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు సోనియా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సీఎం సీటుని సైతం త్యాగం చేసేందుకు సిద్ధమైన గెహ్లాత్‌కే ఏఐసీసీ పీఠం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update: 2022-09-22 14:16 GMT

కాంగ్రెస్ అధ్య‌క్ష‌ పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ సీఎం పీఠాన్ని సైతం వదిలేసేందుకు సిద్ధమయ్యారా..? అందుకే ఆయన ప్లాన్-బితో సోనియాని కలిశారా..? సోనియా గాంధీని కలసినప్పుడే రాజస్థాన్‌లో తన వారసుడి పేరు కూడా ప్రతిపాదించారట గెహ్లాత్. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని తన తర్వాత సీఎంగా చేసేందుకు ఆయన ప్రతిపాదన పెట్టారట. అంటే ఆయన ఏఐసీసీ పీఠం కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.

ప్రస్తుతానికి అశోక్ గెహ్లాత్‌తో పాటు ఇతర నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆమధ్య రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తారనే అనుకున్నా, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన అయిష్టాన్నిమరోసారి బయటపెట్టాయి. సో, ఆయన పోటీకి దూరంగా ఉంటారని స్పష్టమైంది. అయితే ఆ స్థానంలో ఉండే వ్యక్తి దేశం కోసం పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఐడియాలజీలను పాటించాల్సి ఉంటుందని చెప్పారు రాహుల్ గాంధీ. జోడు పదవుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.

వాస్తవానికి సోనియాగాంధీని గెహ్లాత్ కలసిన తర్వాత, అవకాశం ఉంటే రెండు పదవులు చేపడతానని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నుంచి జోడు పదవులపై క్లారిటీ వచ్చింది. దీంతో సోనియాను కలిసినప్పుడే గెహ్లాత్ తనకు ఆల్టర్నేట్‌గా సీపీ జోషి పేరు ప్రతిపాదించారనే వార్త బయటకొచ్చింది. మొత్తమ్మీద గెహ్లాత్ క్లారిటీతో ఉన్నారు. ఆయన విషయంలో పార్టీ కూడా క్లారిటీతోనే ఉందన్న విషయం తేలిపోయింది.

సోనియా మద్దతు ఎవరికి..?

ఏఐసీసీ పీఠంపై ఎవరు ఉన్నా కూడా సోనియా, రాహుల్‌ని కాదని నిర్ణయాలు తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా వాటిని అమలు చేయడం సాధ్యం కాదు. రాహుల్ ఆ స్థానంలో లేకపోయినా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవారే ఏఐసీసీ పీఠంపై ఉంటారనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. కానీ పార్టీ నియమ నిబంధనల ప్రకారం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికలతో భేదాభిప్రాయాలు రావడం కంటే.. ముందుగానే అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు సోనియా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సీఎం సీటుని సైతం త్యాగం చేసేందుకు సిద్ధమైన గెహ్లాత్‌కే ఏఐసీసీ పీఠం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. వయస్సు రీత్యా కూడా గెహ్లాత్‌కి ఇదే సరైన సమయం అంటున్నారు. మరి సోనియా గాంధీ ఆలోచన ఎలా ఉందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Advertisement

Similar News