మహారాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా
శివాజీని మహారాష్ట్ర ప్రజలు దైవంలా భావిస్తారని, ఆయన విగ్రహం కూలిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారన్నారు. వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలో 35 అడుగుల ఎత్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలిన నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలో కొలువైన ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ఆర్భాటంతో గత ఏడాది డిసెంబర్ 4న శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం 9 నెలలు కూడా గడవకముందే కుప్పకూలిపోయింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుందని.. ప్రచారంపై పెట్టిన శ్రద్ధ విగ్రహ నిర్మాణ నాణ్యతపై చూపలేదని విపక్ష నాయకులు మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఇవాళ మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రజలకు శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు. శివాజీని మహారాష్ట్ర ప్రజలు దైవంలా భావిస్తారని, ఆయన విగ్రహం కూలిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారన్నారు. వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. శివాజీ కంటే గొప్ప దైవం ఏమీ లేదని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగానే శివాజీ విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని వారు చెప్పారు.