ఆ దర్శకుడు రాత్రివేళ నా గది తలుపు కొట్టేవాడు..

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి మహిళ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు.

Advertisement
Update:2024-08-26 19:47 IST

మాలీవుడ్‌లో మహిళలపై వేధింపుల వ్యవహారం జస్టిస్‌ హేమ నివేదికతో బయటికొచ్చిన నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటికొచ్చి వారు ఎదుర్కున్న ఇబ్బందులను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. తాజాగా నటి గీతా విజయన్‌ సీనియర్‌ దర్శకుడు తులసీదాస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక సినిమా షూటింగ్‌ సమయంలో రాత్రివేళ తనకు కేటాయించిన హోటల్‌ గది తలుపును తులసీదాస్‌ కొడుతుండేవాడని ఆమె చెప్పారు. ఆయన తీరును తాను తప్పుప‌ట్టగా.. సెట్‌లో తనను ఇబ్బందిపెట్టారని ఆమె తెలిపారు. సెట్‌లో డైలాగ్‌లు చెప్పేవాడు కాదని, ఇండస్ట్రీ నుంచి తప్పించేస్తానని బెదిరించేవాడని వివరించారు. 1991లో ’చంచట్టం’ చిత్రం షూటింగ్‌లో భాగంగా తాను ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌లో ఎన్నో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని గీతా విజయన్‌ ఈ సందర్భంగా చెప్పారు. మహిళలను వేధింపులకు గురి చేసిన వారందరికీ ఇప్పుడు ఒక భయం ఏర్పడిందని ఆమె తెలిపారు. వారికి తప్పకుండా శిక్ష పడుతుందని భయపడుతున్నారని ఆమె చెప్పారు. ఈ భయం అందరిలో ఉండాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి మహిళ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు. గీతా విజయన్‌ దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించారు. సిటీ పోలీస్, జాక్‌పాట్, మిషన్‌ 90 డేస్, పాప్‌ కార్న్, సాక్ష్యం, నిర్ణయం వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు.

Tags:    
Advertisement

Similar News