కాంగ్రెస్ పార్టీ వైపు వినేశ్ పోగట్ చూపు!

భారత కుస్తీ సంచలనం వినేశ్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి.

Advertisement
Update: 2024-08-28 05:58 GMT

భారత కుస్తీ సంచలనం వినేశ్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి.

పారిస్ ఒలింపిక్స్ మహిళా కుస్తీలో బంగారు పతకం గెలుచుకొనే అవకాశాన్ని దురదృష్టవశాత్తు చేజార్చుకొన్న ప్రముఖ వస్తాదు వినేశ్ పోగట్ ను హర్యానా సర్వఖాప్ పంచాయితీ ప్రత్యేక స్వర్ణపతకంతో సత్కరించింది. తన స్వగ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో అభిమానులు, ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలు హాజరయ్యారు.

పుట్టిన ఊరులో అపూర్వ సత్కారం...

2024 ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున మూడుదేశాల వస్తాదులను చిత్తు చేయడం ద్వారా ఫైనల్స్ చేరిన వినేశ్ పోగట్..బంగారు పతకం పోటీ ప్రారంభానికి ముందు నిర్ణిత బరువుకంటే 100 గ్రాములు అదనంగా ఉండడంతో నిబంధనల ప్రకారం పోటీల నుంచి బహిష్కరించారు. దీంతో స్వర్ణపతకం కోసం పోటీ పడే అవకాశం మాత్రమే కాదు...కనీసం రజత పతకమైనా దక్కించుకొనే అవకాశం లేకుండాపోయింది.

కేవలం 100 గ్రాముల అధిక బరువుతో వినేశ్ కు జరిగిన అన్యాయం పట్ల దేశంలోని కోట్లాదిమంది చలించిపోయారు. వినేశ్ తో పాటు దేశవాసులందరూ తల్లడిల్లిపోయారు.

తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ వినేశ్ చేసిన అప్పీలును సైతం అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య తిరస్కరించడంతో ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగిరాక తప్పలేదు.

ఫైనల్లో పాల్గొనే అవకాశం లేకపోడంతో తీవ్రనిరాశకు గురైన వినేశ్ అర్థంతరంగా కుస్తీ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే..హర్యానా అఖిల రైతు సమాఖ్య నిర్వహించిన తన సన్మాన కార్యక్రమంలో వినేశ్ పాల్గొని బంగారు పతకం స్వీకరించింది. స్వర్ణపతకంతో పాటు 5 లక్షల 50వేల రూపాయలు నజరానాగా అందచేశారు.

ఒలింపిక్స్ లో వంద పతకాలు సాధించినా రాని తృప్తి తనకు దేశవాసుల నుంచి, ప్రధానంగా తన రాష్ట్ర్రప్రజల నుంచి దక్కిందంటూ వినేశ్ పొంగిపోయింది. దేశంలోని కోట్లాదిమంది అభిమానులకు తాను జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పింది. తాను పుట్టి పెరిగిన బలాలీ గ్రామంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో భర్త సోమ్ వీర్ రాఠీతో కలసి వినేశ్ పాల్గొంది.

కుస్తీ' పట్టు' వీడేది లేదు...?

కుస్తీ నుంచి తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..ఆటకు దూరంగా ఉండటం కష్టమేనని, గత దశాబ్దకాలంగా తాను కుస్తీనే జీవితంగా, శ్వాసగా బతికానని గుర్తు చేసింది.

రిటైర్మెంట్ ను ఉపసంహరించుకొంటారా అన్నప్రశ్నకు వినేశ్ సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకొంది. అయితే...మహిళా వస్తాదుల పై జరిగిన, జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటాన్ని నిలిపివేసే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. తమ పోరాటానికి ఇది ఆరంభమే కానీ..ముగింపుకానేకాదని తేల్చి చెప్పింది.

అహరహం శ్రమిస్తూ..అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ దేశానికి పతకాలు సంపాదించి పెట్టే మహిళా వస్తాదులను లైంగికంగా వేధించడం, ఆరళ్లకు గురిచేయటం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించింది.

రాజకీయాల పట్ల వినేశ్ ఆసక్తి...

మరోవైపు..కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ దాష్టీకానికి వ్యతిరేకంగా రెండుమాసాలపాటు పలువురు వస్తాదులతో కలసి పోరాడిన వినేశ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమన్న ప్రచారం జోరందుకొంది. హర్యానా ప్రతిపక్షనాయకుడు భూపిందర్ సింగ్ హుడా సైతం పాల్గొన్నారు. త్వరలో జరిగే హర్యానా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున వినేశ్ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించే అవకాశం చేజార్చుకొన్న వినేశ్ కు హర్యానా ప్రభుత్వం మిగిలిన పతక గ్రహీతలతో సమానంగా 4 కోట్ల 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించింది.

ఒలింపిక్స్ లో హర్యానాకు చెందిన అథ్లెట్లు స్వర్ణం సాధిస్తే 6 కోట్లు, రజతానికి 4.5 కోట్లు, కాంస్యపతకానికి 3 కోట్ల రూపాయలను ఇస్తామని రాష్ట్ర్రప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News