Vehicle Scrapage Policy | కార్ల కొనుగోలు దారుల‌కు గ‌డ్క‌రీ బంప‌రాఫ‌ర్‌..

పాత వాహ‌నాల‌ను స్క్రాపేజీ కింద గుర్తించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 1000 వెహిక‌ల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Advertisement
Update:2024-08-28 14:19 IST

Vehicle Scrapage Policy | మీరు వాడుతున్న కారు పూర్తిగా పాతబ‌డి పోయిందా..? కొత్త కారు కొనుక్కోవాల‌ని భావిస్తున్నారా..? అయితే పాత కారు స్థానే కొత్త కారు కొనుక్కోవాల‌నుకునే వారికి డిస్కౌంట్ కూడా ఇవ్వాల‌ని కార్ల త‌యారీ సంస్థ‌ల ముందు కేంద్రం ప్ర‌తిపాదించింది. కారు లేదా ఇత‌ర వాహ‌నం ధ‌ర‌లో 1.5 శాతం నుంచి మూడు శాతం వ‌ర‌కూ ధ‌ర త‌గ్గించాల‌ని కూడా ప్ర‌తిపాదించారు కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ మేర‌కు సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ (సియామ్‌) ప్రతినిధులు.. ఆటోమొబైల్ రంగ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను నితిన్ గడ్క‌రీ దృష్టికి తెచ్చారు. పాత వాహ‌నాల‌ను స్క్రాపేజీ కింద తొల‌గించిన‌ట్లు ఆథ‌రైజ్డ్ స్క్రాపేజ్ సెంట‌ర్ నుంచి స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌ స‌మ‌ర్పించిన వారికి డిస్కౌంట్ ఆఫ‌ర్ చేయాల‌ని నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. ఈ నిబంధ‌న వాణిజ్య వాహ‌నాల‌కు, ప‌ర్స‌న‌ల్ మొబిలిటీ వాహ‌నాల‌కూ వ‌ర్తింప జేయాల‌ని ప్ర‌తిపాదించారు నితిన్ గ‌డ్క‌రీ.

పూర్తిగా పాత ప‌డిన వాహ‌నాన్ని (ట్ర‌క్కు లేదా కారు) ఆథ‌రైజ్డ్ స్క్రాపేజ్ సెంట‌ర్‌లో స్క్రాప్ చేసి ఆ సెంట‌ర్ నుంచి స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌ తీసుకోవాలి. అలా స‌ర్టిఫికెట్ తీసుకున్న పాత వాహ‌న య‌జ‌మానులు కొత్త వాహ‌నం కొంటే డిస్కౌంట్లు అందించాలని కార్ల త‌యారీ సంస్థ‌ల‌ను నితిన్ గ‌డ్క‌రీ కోరారు. అయితే ప‌లువురు వాణిజ్య వాహ‌నాల త‌యారీ సంస్థ‌లు రెండేండ్ల పాటు స్క్రాపేజీ డిస్కౌంట్‌ ఇవ్వ‌డానికి అంగీక‌రించాయి. కార్ల త‌యారీ సంస్థ‌లు మాత్రం ఒక ఏడాది డిస్కౌంట్ అందించేందుకు మొగ్గు చూపాయి.

మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra), హ్యుండాయ్ (Hyundai), కియా (Kia), ట‌యోటా (Toyota), హోండా (Honda), ఎంజీ మోటార్స్ (MG Motors), రెనాల్ట్ (Renault), నిసాన్ (Nissan), స్కోడా (Skoda), ఫోక్స్ వ్యాగ‌న్ (Volkswagen) కంపెనీలు ఎక్స్ షోరూమ్ ధ‌ర‌పై 1.5 శాతం డిస్కౌంట్ లేదా రూ.20 వేల డిస్కౌంట్‌.. రెండింటిలో త‌క్కువ డిస్కౌంట్ అందిస్తామ‌ని తెలిపాయి. గ‌త ఆరు నెల‌ల్లో స్క్రాపేజీ కింద తొల‌గించిన కార్ల‌కు మాత్ర‌మే ఈ డిస్కౌంట్ త‌గ్గింపు వ‌ర్తిస్తుంద‌ని ష‌ర‌తు విధించాయి. అద‌న‌పు డిస్కౌంట్లు స్వ‌చ్ఛందంగా అందిస్తామ‌ని పేర్కొన్నారు.

టాటా మోటార్స్ (Tata Motors), వోల్వో (Volvo), ఎచిర్ (Eicher), అశోక్ లేలాండ్ (Ashok Leyland), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra), ఫోర్స్ మోటార్స్ (Force Motors), ఇసుజు (Isuzu), ఎస్ఎంఎల్ ఇసుజు (SML Isuzu) వంటి వాణిజ్య వాహ‌నాల త‌యారీ సంస్థ‌లు 3.5 ట‌న్నుల పై చిలుకు కొత్త వాణిజ్య వాహనాల‌పై 3 శాతం, 3.5 ట‌న్నుల లోపు బ‌రువు గ‌ల వాహ‌నాల‌పై 1.5 శాతం డిస్కౌంట్ అందిస్తామ‌ని తెలిపాయి. పాత వాహ‌నాల‌ను ఆరు నెల‌ల్లో స్క్రాపేజ్ చేసిన‌ట్లు స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇదే స్కీమ్ బ‌స్సులూ వ్యాన్ల‌కూ వ‌ర్తిస్తుంది.

రోడ్ల‌పైకి క్లీన‌ర్, సేఫ‌ర్‌, మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన వాహ‌నాల‌ను తేవ‌డానికి స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీ మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఇన్షియేటివ్ గ‌ణ‌నీయ పాత్ర పోషిస్తుంద‌న్నారు నితిన్ గ‌డ్క‌రీ. దీనివ‌ల్ల వాటాదారులంద‌రికీ ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. పాత వాహ‌నాల‌ను స్క్రాపేజీ కింద గుర్తించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 1000 వెహిక‌ల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనివ‌ల్ల కొత్త‌గా ఉద్యోగాలు సృష్టించ‌వ‌చ్చున‌ని చెప్పారు. అంతే కాదు ఈ విధానం పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తే ద‌క్షిణాసియాలోనే భార‌త్ స్క్రాపేజీ హ‌బ్‌`గా నిలుస్తుంద‌న్నారు. స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీని ప్రోత్స‌హించేందుకు 2021 ఆగ‌స్టులో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ `నేష‌న‌ల్ వెహిక‌ల్ స్క్రాపేజీ విధానం ప్రారంభించారు.

2022 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి నేష‌న‌ల్ వెహిక‌ల్ స్క్రాపేజీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. దీని కింద వాహ‌నాల య‌జ‌మానులు త‌మ పాత వాహ‌నాల‌ను స్క్రాపేజీకి త‌ర‌లించిన‌ట్లు స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పిస్తే, కొత్త వాహ‌నాల కొనుగోలుపై 25 శాతం వ‌ర‌కూ రోడ్ టాక్సులో రాయితీ అందించాల‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కేంద్రం కోరింది. 2021-22లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌న కేంద్ర బ‌డ్జెట్‌లో వాణిజ్య‌ వాహ‌నాలు కొనుగోలు చేసిన 15 ఏండ్ల త‌ర్వాత, వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏండ్ల త‌ర్వాత ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News