ఆ ఘటనను నేనెప్పటికీ మర్చిపోను
దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి కారవాన్ తమ ప్రైవేట్ ప్లేస్ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుందని చెప్పారు.
మాలీవుడ్‌పై జస్టిస్ హేమ రిపోర్టు సంచలనాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీ నటి రాధిక తాజాగా స్పందించారు. 46 ఏళ్ల నుంచి తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తన అభిప్రాయమని ఆమె చెప్పారు. అన్ని చోట్లా ఇదేవిధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని ఆమె తెలిపారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరమని చెప్పారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని రాధిక వెల్లడించారు. ఓసారి సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోనని ఆమె చెప్పారు. సినిమా షూటింగ్‌లో భాగంగా షాట్ ముగించుకుని వెళ్తుండగా.. సెట్‌లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్న విషయం గమనించానని తెలిపారు. వాళ్లు ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైందని, చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి.. ఏం చూస్తున్నారని అడిగానని, కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్‌లో చూస్తున్నారని అతను చెప్పాడని వివరించారు.
ఈ విషయంపై తాను చిత్ర బృందానికి ఫిర్యాదు చేశానని, కారవాన్‌లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని ఆ టీమ్‌కి వార్నింగ్ ఇచ్చానని రాధిక వెల్లడించారు. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి కారవాన్ తమ ప్రైవేట్ ప్లేస్ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుందని చెప్పారు. రాధిక వ్యాఖ్యలు ప్రస్తుతంగా వైరల్‌గా మారాయి.