పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..

తన పెళ్లికి అక్కడున్న విద్యార్థినులందర్నీ తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పారు రాహుల్.

Advertisement
Update:2024-08-27 07:39 IST

రాహుల్ గాంధీ పెళ్లెప్పుడు..? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు కూడా సూటిగా సమాధానం చెప్పరు. అసలు రాహుల్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ రాహుల్ తొలిసారిగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 20-30 ఏళ్లుగా పెళ్లిపై వచ్చే ప్రశ్నల్ని తప్పించుకుంటూ ఆ ఒత్తిడిని అధిగమిస్తూ వచ్చానని, అయితే పెళ్లి ప్రణాళికని పూర్తిగా తోసిపుచ్చలేమని ఆయన చెప్పారు. అంటే వివాహానికి దూరంగా ఉండటం తన వల్ల కూడా కాదని రాహుల్ గాంధీ పరోక్షంగా తేల్చేశారు.


ఇటీవల జమ్మూకాశ్మీర్ పర్యటన సందర్భంగా శ్రీనగర్ లో కొంతమంది విద్యార్థినులకు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వీడియోలో కొంత భాగాన్ని ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇందులో పెళ్లిపై ఆసక్తికర ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి. విద్యార్థినుల చదువు, కెరీర్ గురించి మాట్లాడే క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబ సభ్యులనుంచి ఒత్తిడి ఉంటుందా అని రాహుల్ గాంధీ, విద్యార్థినులను ప్రశ్నించారు. మా సంగతి సరే ముందు మీ సంగతి చెప్పండి అంటూ వారి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో రాహుల్ సరదాగా నవ్వుతూ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. తన పెళ్లికి అక్కడున్న విద్యార్థినులందర్నీ తప్పకుండా ఆహ్వానిస్తానని కూడా చెప్పారు రాహుల్.

ఇటీవల రాహుల్ గాంధీ పెళ్లి, కుటుంబం.. అంటూ బ్లిట్జ్ పత్రికలో కథనాలు వచ్చాయంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పెద్ద రచ్చ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రిక కథనాలు చూపించారు. అంతే కాదు, వాటిపై రాహుల్ గాంధీ స్వయంగా స్పందించాలంటూ ఆయన ఇంటికి వెళ్లి మరీ హడావిడి చేశారు. బ్లిట్జ్ పత్రిక కథనాలను రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉన్న స్టాఫ్ కి అందించి వచ్చారు. రాహుల్ కి పెళ్లి అయిందంటూ రఘునందన్ రావు వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలో రాహుల్ గాంధీ.. తన పెళ్లిపై స్పందించడం విశేషం. ఇప్పటికైనా రఘునందన్ రావుకి సమాధానం లభించినట్టేనా అని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్లిస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News