వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడిన హెలికాప్టర్
వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కిందపడింది. హెలికాప్టర్ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది.
మరమ్మతుల కోసం తరలిస్తున్న హెలికాప్టర్ వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడిన ఘటన శనివారం ఉదయం జరిగింది. ఈ క్రెస్టల్ హెలికాప్టర్ కేదార్‌నాథ్‌లో ఇటీవల ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దీంతో ఈ హెలికాప్టర్‌ను తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. క్రెస్టల్ హెలికాప్టర్‌ను తరలించేందుకు ఆర్మీకి చెందిన ఎంఐ–17 చాపర్‌ను తీసుకొచ్చారు. దానికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో హెలికాప్టర్‌ను కట్టి తరలిస్తుండగా కొద్దిదూరం ప్రయాణించిన అనంతరం ఎంఐ–17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు తెగిపోయాయి. దీంతో క్రెస్టల్ హెలికాప్టర్ జారి కింద పడిపోయింది.
కేదార్‌నాథ్–గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కిందపడింది. హెలికాప్టర్ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇటీవల ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేదార్‌నాథ్ యాత్రను ఆగస్టులో నిలిపివేశారు. దీంతో యాత్రికులు వాయుమార్గంలో ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన క్రెస్టల్ హెలికాప్టర్‌ను యాత్రికులను తరలించేందుకు వినియోగించేవారు. ఇంకోపక్క భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్‌నాథ్ మధ్య చిక్కుకుపోయిన వేలాదిమంది యాత్రికులను రక్షించేందుకు సైన్యం, వాయుసేన చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి.