కంగనా..! నోరు అదుపులో పెట్టుకో.. బీజేపీ హైకమాండ్ వార్నింగ్

కంగనా రనౌత్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది.

Advertisement
Update:2024-08-26 21:04 IST

"మండీ లోక్ సభ సభ్యురాలు కంగనా రనౌత్ కి పార్టీ విధానంపై మాట్లాడే అధికారం లేదు. పార్టీ తరపున ప్రకటనలు చేసేందుకు ఆమెకు ఎవరూ అనుమతి ఇవ్వలేదు. భవిష్యత్తులో ఆమె ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వరు." అంటూ బీజేపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంపీ కంగనకు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించింది.

అసలేం జరిగింది..?

రైతు చట్టాలు, వివాదాలు, నిరసనలు, వాటి రద్దు.. అందరికీ తెలిసిందే. రైతు చట్టాలు బీజేపీని బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే వాటిపై స్పందించేందుకు నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ కంగనా రనౌత్ రద్దయిన రైతు చట్టాలు, అప్పట్లో ఢిల్లీ వద్ద జరిగిన ఆందోళనలపై మరోసారి తీరిగ్గా స్పందించారు. అప్పట్లో జరిగిన రైతుల ఆందోళనను విదేశీ కుట్రగా ఆమె అభివర్ణించారు. గతంలో కూడా ఆమె రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ పాత గాయాన్ని రేపి.. అది విదేశీ కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పటిష్ట చర్యలు తీసుకోకుండా ఉండి ఉంటే, భారత్ పరిస్థితి కూడా బంగ్లాదేశ్ లాగా మారిపోయి ఉండేదంటూ నోరు జారారు కంగనా. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కంగనా రనౌత్ కామెంట్లపై బీజేపీ స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

కంగనా రనౌత్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. అసలు బీజేపీ తరపున అధికారికంగా మాట్లాడేందుకు కంగనా రనౌత్ కి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ వివరణతో వివాదానికి బీజేపీ ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఇటీవల కంగనపై చండీఘడ్ విమానాశ్రయంలో ఓ మహిళా కానిస్టేబుల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. గతంలో కంగన రైతు ఉద్యమంపై చేసిన వ్యాఖ్యల కారణంగానే దాడి చేశానని సదరు కానిస్టేబుల్ వివరణ ఇచ్చారు కూడా. ఇప్పుడు కంగన మళ్లీ రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు.

వివాదాల కారణంగానే బీజేపీకి కంగనా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆమె నాలుగు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. కంగనకు పద్మశ్రీ అవార్డు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. చివరిగా ఆమె బీజేపీ టికెట్ సాధించి లోక్ సభలో ఎంట్రీ ఇచ్చారు. అయితే వివాదాలతో బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించిన ఆమె, చివరకు అలాంటి వ్యాఖ్యలతోనే చీవాట్లు తింటున్నారు. మరి తన సహజసిద్ధ ధోరణిని ఆమె వదులుకుంటారా..? హైకమాండ్ చెప్పినట్టు నడచుకుంటారా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News