అందం కోసం అన్ని కోట్ల ఖర్చా..?
మహిళలు గత ఆరు నెలల్లో భారత్‌లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారు.
గత రెండేళ్ళుగా కరోనాతో మూసుకున్న తలుపులు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. కొంత కాలంగా ఇంటిపట్టునే ఉన్న మహిళలు ఆఫీసులకు, అమ్మాయిలు కాలేజీలకు హాజరవుతున్నారు. ఇంకేముంది అందచందాలు, అలంకరణల మీద దృష్టి సారిస్తున్నారు. ఎంతగా అంటే గత ఆరు నెలల్లో దేశంలోని పది ప్రధాన నగరాలలో లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్‌లు, ఐ లైనర్‌లు మొదలైనవాటి కొనుగోలు కోసం దాదాపు రూ.5 వేల కోట్లు వెచ్చించారు ఈతరం మహిళలు.
ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. కాంతర్ వరల్డ్ ప్యానల్ (Kantar Worldpanel) అనే ఓ సంస్థ సర్వేలో తేలిన ‘అందమైన’ నిజం. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు.. బిజినెస్ ఉమెన్స్ గా పని చేసేవాళ్ళు మినిమమ్ మేకప్ వేసుకోక తప్పడం లేదు..
మహిళలు గత ఆరు నెలల్లో భారత్‌లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారు. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఏకంగా ఈ ఆరు నెలల్లో రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. వీరిలో 40శాతం మంది మహిళలు ఆన్ లైన్ లోనే కొంటున్నారని కాంతర్ వరల్డ్ ప్యానల్ నివేదికలో వెల్లడించింది. అలాగే కాస్మెటిక్ మార్కెట్లో ప్రధానంగా వర్కింగ్ ఉమెన్ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఎక్కువగా సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. సగటు ఖర్చుతో పోలిస్తే ఉద్యోగం చేస్తున్న మహిళలో మేకప్ సేల్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ 1.6 రెట్లు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారట. అంటే సగటున ఒక్కొక్కరు ఈ ఆరు నెలల్లో రూ. 1,214 కాస్మెటిక్స్ కోసం ఖర్చు చేశారు. అందులో లిప్ స్టిక్ అగ్రస్థానంలో ఉండగా తరువాత స్థానం నెయిల్ ఉత్పత్తులది.
అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ కోసం చూస్తుంటే.. యుక్త వయసు వారు మాత్రం ప్రీమియర్ లిప్ బామ్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కాస్మెటిక్ బూమ్‌కు, మహిళా సాధికారతకు సంబంధం ఉంది. ఆమెలో కొనుగోలు శక్తి పెరిగిందంటే, సంపాదన కూడా పెరిగినట్టే. నచ్చిన వస్తువు అది కూడా వంటింటికి సంబంధించినది కాకుండా అందానికి సంబంధించి షాపింగ్ చేస్తున్నారంటే ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టేనేమో.. కాదంటారా..