ప్రజా పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛా నేరమేనా?

సోషల్‌ మీడియాను చూసి ఉలిక్కిపడుతున్న సీఎం రేవంత్‌

Advertisement
Update:2024-11-19 10:02 IST

ఏడాది కిందట ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌పై సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసింది. అనేక కట్టుకథలు అల్లింది. ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేసింది. అన్నివర్గాలు బీఆర్‌ఎస్‌ పాలనలో అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని నమ్మబలికారు. ప్రధాన మీడియా కంటే సోషల్‌ మీడియానే ఎక్కువగా నమ్మకుని కేసీఆర్‌ ప్రభుత్వంపై విష ప్రచారం చేసింది. కానీ గత ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను ఎన్నడూ అడ్డుకోలేదు. వ్యక్తిగతంగా కేసీఆర్‌ కుటుంబంపై అడ్డగోలు విమర్శలు చేసిన వారిపైనే కొన్నిసార్లు స్పందించింది. చట్ట ప్రకారం వ్యవహరించింది. కానీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌ మాట మార్చారు. యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లను గొట్టంగాళ్లు అన్నారు. సోషల్‌ మీడియాను నమ్మకుంటే జైలే గతి అని హెచ్చరించారు. పదకొండు నెలల కిందట సోషల్ మీడియా ముద్దు అన్న రేవంత్‌ రెడ్డి ఇప్పుడు అదే మీడియాను ముప్పు అంటున్నారు. కలలో కూడా ఉలిక్కిపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌తో పాటు ప్రభుత్వ తప్పులను సోషల్‌ మీడియా వేదికగా ఎత్తిచూప్తున్న వారిని రేవంత్‌ ప్రభుత్వం కొన్నిరోజులుగా టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా లుక్‌ ఔట్‌ నోటీసులు కూడా ఇచ్చింది. సోషల్‌ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వారిని అరెస్టు చేయాలని చూస్తే కోర్టులు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై నిత్యం కొణతం దిలీప్‌ లాంటి వారు సోషల్‌ మీడియా వేదికగానే కాదు, ప్రధాన పత్రికల్లోనూ వ్యాసాలు రాస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని మరుగునపరచడానికి రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న యత్నాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో రెండు మూడుసార్లు తెలంగాణ అధికారిక రాజ ముద్రను వివిధ చోట్ల మార్చిపెట్టిన సంగతి మనమంతా చూసిందే. అది ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు జరిగిందా? లేక కావాలనే ఆ లోగోను పెట్టారా? అన్నదానికి ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. తెలంగాణ చిహ్నాన్ని మార్చాలనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నుంచే కాదు పౌర సమాజం నుంచి ఇతర విపక్ష పార్టీల నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గి అప్పుడప్పుడు లోగో పై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

ఇక రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలు, గురుకుల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల దుస్థితి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నియామకాలపై ప్రభుత్వ అసత్య ప్రచారం, జీవో 29, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, రాష్ట్రంలో శాంతిభద్రత అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలకు ఇచ్చిన హామీలపై నిత్యం రాష్ట్ర ప్రభుత్వానికి సోషల్‌ మీడియా వేదికగా కొణతం దిలీప్‌ తోపాటు అనేకమంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కంటగింపు అయ్యింది. దీనికితోడు దేశవ్యాప్తంగా అటెన్షన్‌ సృష్టించిన లగచర్ల ఘటనపై రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు హుస్సేన్‌ నాయక్‌ లగచర్లలో పర్యటించడం, ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడికి పాల్పడిన వారంతా జైలు బైటే ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే రైతులను జైలు పంపారన్నారు. ఘటనపై వారం పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. అలాగే ఆ బాధితులు ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ, మానవహక్కుల,మహిళా కమిషన్‌ల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దాష్టీకాలను తీసుకురావడం వంటి అంశాలు నిన్న చోటు చేసుకున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతిభద్రలు క్షీణించడం, ప్రజల పోలీసుల దౌర్జన్యం వంటివి రాష్ట్రంలో పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు అలవాటు పడిన అధికారపార్టీ నిన్న కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన కొణతం దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల అత్యుత్సాహాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. నేరారోపణలపై ఆయనను రిమాండ్‌కు తరలించాలనే పిటిషన్‌ను న్యాయమూర్తి తోసి పుచ్చారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఆయనను విడుదల చేయాలని ఆదేశించారు. ప్రజా పాలనలో ప్రశ్నించే వారిని అరెస్టులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, అణిచివేతలు కొనసాగిస్తామనుకుంటే అదిఎళ్లకాలం నడవదని రేవంత్‌ సర్కార్‌ తెలుసుకుంటే మంచిది. ప్రజలకు ఇచ్చిన హామీలపై అమలుపై దృష్టి సారిస్తే బాగుటుంది. కక్షపూరిత, ప్రతీకార చర్యలతో కాలం వెళ్లదీయాలనుకుంటే ప్రజల నుంచి తిరుగుబాటే ఎదురవుతుందని కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాట్లే దానికి నిదర్శనం.

Tags:    
Advertisement

Similar News