ఆరు గ్యారెంటీలు పాయే.. రేవంత్ ఫ్యామిలీ పాలన వచ్చే
ఏడాదిలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు.. సొంతపార్టీలోనే అసంతృప్తి
బీఆర్‌ఎస్ ను ఖతం చేస్తా. కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తా, ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తప్పా ఎవరూ మిగిలరు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మాతో టచ్‌లో ఉన్నారు. బీఆర్‌ఎస్ ఎల్పీ త్వరలో కాంగ్రెస్‌లో విలీనమౌతుందని సీఎం సహా ఆపార్టీ మంత్రులు, నేతలు మొన్నటిదాకా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే రేవంత్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి కారణం సీఎం సొంత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ఆరు గ్యారెంటీల అమలు గురించి సీఎం చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఎంత ఊదరగొట్టే ప్రచారం చేసినా ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని టాక్. ఇప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే హైదరాబాద్ సహా చాలాచోట్లా పార్టీ మూడోస్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేశామని పత్రికలు, హోర్డింగ్‌లలో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం దీనిపై అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష ప్రశ్నిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని కొత్త పాట పాడుతున్నది. ముఖ్యమంత్రి నిత్యం అప్పుల ముచ్చటే చెబుతున్నారు. కొన్ని రోజులుగా మంత్రులు కూడా రేవంత్‌రెడ్డినే అనుసరిస్తున్నారు. అన్ని గ్యారెంటీలను అమలు చేయలేమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా ప్రారంభించిన ప్రజలకు అందిస్తామంటున్నారు. సీఎం, మంత్రుల మాటలు చూసి మొన్నటిదాకా కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్ పాలనపై సోషల్ మీడియా వేదికగా ఒంటికాలిపై లేచిన వాళ్లూ కూడా ఇదే పద్దతి అంటూ పెదవి విరుస్తున్నారు. రుణమాఫీ సంపూర్ణంగా పూర్తి చేయకపోతిరి. రైతు బంధు ఇవ్వకపోతిరి. ఆరు గ్యారెంటీలు అమలు మరిచిపోతిరి అంటూ విమర్శిస్తున్నారు. ఒకవేళ రుణమాఫీ సాధ్యకాదని అనుకుంటే ఆ విషయాన్ని రైతులకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా మూసీ సుందరీకరణ పేరుతో, హైడ్రా చర్యలతో కాంగ్రెస్ పార్టీ బాగా బద్నాం అయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. సీఎం సొంత కోటరి ఏర్పాటు చేసుకుని ఎవరినీ పట్టించుకోవడం లేదని, పార్టీలో సమన్వయం కొరవడిందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిలా కాకుండా కాషాయ పార్టీ ప్రతినిధిగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారనేది సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నకొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ కుటుంబ పాలన గురించి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఇప్పుడు ఎనుముల రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ పెత్తనంపై కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. కేసీఆర్ కుటుంబ పాలన గురించి ఎన్ని విమర్శలు వచ్చినా ఏనాడు వెనుకకు పోలేదు. వాళ్లంతా ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు పాలనలోనూ ఉంటారు. భవిష్యత్తులోనూ కొనసాగుతారని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అంతేగాని రేవంత్‌రెడ్డి లెక్క పాలనలో వాళ్ల ఫ్యామిలీ ప్రమేయం ఉంటుందని తాను అనుకోవడం లేదని సీఎం అయిన కొత్తలో చెప్పినట్టు చెప్పలేదు.
రేవంత్ రెడ్డి మాట మార్చడం కొత్త కాదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటిపై యూటర్న్ తీసుకున్నారు. అదేమిటని అడిగిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు. నిరసన చేస్తున్న నిరుద్యోగులపై నిర్బంధం విధించారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ, కస్తూర్భా స్కూళ్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు హచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగానే.. మొన్న లగచర్ల ఫార్మా సిటీ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తే వాళ్లందరినీ అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఆ సమయంలో కనీసం సర్పంచ్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడి వెళ్లి ఫార్మా సిటీ వచ్చి తీరుతుంది. భూములను బరాబర్ తీసుకుంటామని మాట్లాడటం వివాదాస్పదమైంది. ఇది చాలదన్నట్టు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వికారాబాద్‌లో మంత్రులను మించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, కాన్వాయిలో వచ్చిన ఆయనకు బూట్లు తీయించి స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి ప్రధాని,రాష్ట్రపతి,ముఖ్యమంత్రికి చేసినట్లు పరేడ్ చేయించిన వీడియోలో సోషల్ మీడియాలో రావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.
రేవంత్‌రెడ్డి రాజకీయంగా ప్రతిపక్ష నేతలను బలహీనపరచడానికి పెడుతున్న కేసులపైనా సొంతపార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయట. ఇప్పటికే హైడ్రా చర్యలతో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదనే వాదనలు ఉన్నాయి. దీనికితోడు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు పెట్టడంపైనా రేవంత్ సర్కార్ వైఖరికి భిన్నంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే స్పందిస్తున్నారు. ఇవే కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ను నమ్ముకుని అనవసరంగా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకున్నామని అంతర్గతంగా మథనపడుతున్నారట. కాంగ్రెస్ ఇంకా కొన్నేండ్ల పాటు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు. ఇవన్నీ చూసిన తెలంగాణ ప్రజలు ఆరు గ్యారెంటీలు పాయే.. రేవంత్ ఫ్యామిలీ పాలన వచ్చే అంటున్నారు.