కేసీఆర్ వాదనకే బ్రజేశ్ ట్రిబ్యునల్ మొగ్గు
కేంద్రం టీవోఆర్ ప్రకారమే కృష్ణా జల పంపకాల్లో వాదనలు వింటామని స్పష్టీకరణ
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న అప్పటి సీఎం కేసీఆర్ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ బాధ్యతను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగించినప్పుడే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1954లోని సెక్షన్ 3 కింద పంపకాలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేసింది. అంతే కాదు.. ఇదే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో వేసిన చిక్కుముడిని సైతం కేంద్రం విప్పేసింది. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ -1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపులను తాము సమీక్షించబోమని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తన అవార్డులో వెల్లడించింది. బచావత్ ట్రిబ్యునల్ 75 పర్సెంట్ డిపెండబులిటీ వద్ద 811 టీఎంసీలు కేటాయిస్తే తాము 65 శాతం డిపెండబులిటీ వద్ద ఇంకో 194 టీఎంసీలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1,005 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. ఈ తీర్పుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల నీళ్లను తెలంగాణ, ఏపీకి పంపకాలు చేయాలని నిర్దేశించారు. దీని ప్రకారమే ఇదే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇరు రాష్ట్రాల వాదనలు వింటోంది. పదేళ్లుగా ఈ వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణకు ఎప్పటికీ న్యాయం జరగదని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి వాదిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కేంద్ర జలశక్తి శాఖ మంత్రులను కలిసిన ప్రతిసారి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు న్యాయం చేయడం లేదు కాబట్టి సుప్రీం కోర్టు అయినా న్యాయం చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ తో పాటు కేంద్రంతో జరిగిన ప్రతి సమావేశంలోనూ ఇదే డిమాండ్ వినిపిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1954లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నీటి పంపకాలను కొత్త ట్రిబ్యునల్ కు రెఫర్ చేయాలని పట్టుబట్టారు. తద్వారా తెలంగాణకు కృష్ణా నీటి వాటా భరోసా దక్కేందుకు కేసీఆర్ దోహదమయ్యారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేస్ విత్ డ్రా చేసుకోవాలని షెకావత్ ఆ సమావేశంలో అప్పీల్ చేశారు. దానికి కేసీఆర్ సమ్మతించి కేస్ వాపస్ తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నీళ్లను పునః పంపిణీ చేసే బాధ్యతను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగించింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈమేరకు కొత్త ట్రిబ్యునల్ కు టీవోఆర్ ఇచ్చింది. క్యాచ్‌మెంట్ ఏరియా, కమాండ్ ఏరియా, డ్రాట్ ప్రోన్ ఏరియా ఇలా దేనిని ప్రమాణికంగా తీసుకున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో 555 టీఎంసీలకు తగ్గకుండా వాటా దక్కాలి. అంటే ఏపీకి కృష్ణా జలాల్లో వాస్తవ వాటా 256 టీఎంసీలు మాత్రమే. ఈ విషయాన్ని కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే కొత్త ట్రిబ్యునల్ కు సమర్పించిన స్టేట్‌మెంట్ ఆన్ కేస్‌లోనూ తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బలమైన వాదనలు వినిపించేందుకు స్టేట్‌మెంట్ ఆన్ కేస్ ద్వారా బలమైన పునాదిని నిర్మించారు.
తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయానికి కారణమైన ఆంధ్ర పాలకులు.. ఇప్పుడు మనతో వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నారు. కాబట్టి వాళ్లు ఎప్పటి తరహాలోనే సెక్షన్ 3 ప్రకారం కాకుండా ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం పంపకాలు చేయాలని మడత పేచి పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని చూసి బెంబేలెత్తిపోయింది. బుధవారం ఢిల్లీలో సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సెక్షన్ -3 ప్రకారమే పంపకాలు జరిగేలా పట్టుబట్టాలని ఆదేశించడం అంటేనే ఈ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ వ్యవహారాల్లో అంతగా పట్టులేదని తేలిపోతోంది. మరి లక్షలు లక్షలు పోసి ఏపీ నుంచి అరువు తెచ్చుకున్న అడ్వైజర్ ఏం చేస్తున్నట్టో అర్థం కావడం లేదు. ఏపీ ఎంత అడ్డగోలు వాదనకు దిగినా ట్రిబ్యునల్ తమకు కేంద్రం ఏం టాస్క్ ఇచ్చిందో దానికి మాత్రమే కట్టుబడి ఉంటామని క్లారిటీ ఇచ్చింది. ముందు సెక్షన్ -3 ప్రకారం వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల కోసం సెక్షన్ 89 ప్రకారం వాదనలు వింటామని తేల్చిచెప్పింది. తద్వారా ఏపీ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్ వేసినట్టు అయ్యింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టే మనకు 299 టీఎంసీలు దక్కితే ఏపీకి 512 టీఎంసీలు దక్కాయని రేవంత్ ప్రభుత్వం బేలగా వాదిస్తోంది. కృష్ణా నీటి పంపకాలను ట్రిబ్యునల్ తేల్చుతుందని.. అప్పటి వరకు టెంపరరీ వర్కింగ్ అగ్రిమెంట్ గా మాత్రమే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. అది కూడా ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం ఆధారంగా మాత్రమేనని చెప్పింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఏపీలో కృష్ణా నీటి వినియోగం ఎక్కువగా ఉంది.. తాత్కాలిక ఒప్పందం కాబట్టి కేంద్రంతో ఘర్షణ మంచిది కాదన్న ధోరణితో వాళ్ల ప్రతిపాదనకు ఆ సంవత్సరం కోసం మాత్రమే ఓకే చెప్పారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తూ పోవడంతో ట్రిబ్యునల్ నీటి వాటాలు తేల్చే వరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటి వినియోగానికి అనుమతి ఇవ్వాలని ప్రతి వేదికపై డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో చేసిన వాదనను రెఫరెన్స్ గా చూపిస్తూనే కేఆర్‌ఎంబీని 50 పర్సెంట్ వాటా కోసం పట్టుబడుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే.. కొత్త ట్రిబ్యునల్ సెక్షన్ -3 ప్రకారం వాదనలు వినాలని నిర్ణయం తీసుకోవమే తప్ప గొప్ప అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఇల్లు అలకగానే పండుగ కాదు.. ట్రిబ్యునల్ విచారణ జరిగే క్రమంలో బలమైన వాదనలు వినిపించాలి.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా బహిర్గతం చేయాలి.. ఏపీ నీటి దోపిడీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఏపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి తుది వరకు పోరాడాలి. అప్పుడే తెలంగాణకు కృష్ణా జల పంపకాల్లో న్యాయం జరుగుతుంది.