నీటి వాటాలపై కేసీఆర్ వాదనే వినిపించిన రేవంత్ సర్కార్
ట్రిబ్యునల్ వాటాలు తేల్చేవరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటి వాటాలివ్వాలని పట్టు
కృష్ణా నీళ్లలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కకుండా కేసీఆర్ అన్యాయం చేశారని.. 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరించి తీవ్ర నష్టం చేశారని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న వాదన తప్పని తేలిపోయింది. మంగళవారం జలసౌధలో నిర్వహించిన కేఆర్‌ఎంబీ 19వ సమావేశంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదననే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వమూ వినిపించింది. అంతకన్నా ఒక్క లైన్ కూడా అదనంగా చెప్పలేకపోయింది. అడహక్ అగ్రిమెంట్‌కు ట్రిబ్యునల్ కు తేడా తెలియకుండా సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి అడ్డగోలుగా మాట్లాడారని.. వారి వాదననే పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా మాట్లాడటమే కాదు పత్రికల్లో వ్యాసాలు రాసి అందరిముందు నవ్వుల పాలయ్యారని తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో అప్పటికే ఉన్న వినియోగం ఆధారంగా ఒక్క ఏడాది కోసం 34:66 నిష్పత్తిలో అంటే 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలా అడహక్ వర్కింగ్ అరెంజ్‌మెంట్ చేసుకున్నారు. వివిధ కారణాలతో అదే అగ్రిమెంట్ కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత వాటర్ (2024 -25)లోనూ అదే అడహక్ అగ్రిమెంట్ ప్రకారం నీటి వినియోగం కొనసాగుతోంది.
కేఆర్‌ఎంబీ సమావేశంలో 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలకు తాము అంగీకరించబోమని తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. క్యాచ్‌మెంట్, బేసిన్ ఆధారంగా తెలంగాణకు 71 శాతం నీటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కేడబ్ల్యూడీటీ -2 తేల్చాల్సి ఉన్నందున అప్పటి వరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటి పంపకాలు చేయాలని కోరారు. సరిగ్గా ఇదే డిమాండ్ ను కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పాటు కేఆర్‌ఎంబీ సమావేశాల్లో వినిపిస్తూ వచ్చింది. నీటి పంపకాలను ట్రిబ్యునల్ తేల్చాలి కాబట్టి అప్పటి వరకు 66:34 నిష్పత్తిలోనే వర్కింగ్ అరెంజ్‌మెంట్ కొనసాగిస్తే మంచిదని కేఆర్‌ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ సూచించారు. పరిస్థితులను బట్టి తెలంగాణ వాటా కొంచెం పెంచే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వాదనకు ఏపీ ససేమిరా అంది. 50 శాతం నీటి వాటా ఇచ్చేందుకు ఒప్పుకోబోమని చెప్పింది. దీంతో ఇప్పుడున్న వర్కింగ్ అరెంజ్‌మెంట్ కొనసాగింపునకు బోర్డు చైర్మన్ మొగ్గు చూపారు. నాగార్జున సాగర్ పై సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలనే అంశంపై చర్చ సందర్భంగా బోర్డు చైర్మన్ స్పందిస్తూ రెండు రాష్ట్రాలు అందుకు అంగీకరిస్తే తాము కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
ఏదైనా నది జలాల్లో వాటా తేల్చాల్సింది ట్రిబ్యునళ్లే తప్ప ప్రభుత్వాలు కదాన్న విషయం గుర్తించడంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ సంతకం పెట్టారు.. హరీశ్ రావు సంతకాలు పెట్టారు అంటున్న డాక్యుమెంట్ టెంపరరీ వర్కింగ్ అరెంజ్‌మెంట్ మాత్రమే.. దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధంగా నీటి వాటాలు తేల్చాల్సిన ట్రిబ్యునల్ సాధన కోసం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో అన్ని స్థాయిలో ప్రయత్నించారు. కేంద్రం దిగిరాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించారు. ఫలితంగానే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ వాదనతో ఏకీభవించి కృష్ణా జలాల పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆ సమావేశం మినిట్స్‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ వేయాలని పట్టుబట్టారని.. ఆయన కోరినట్టుగానే ఈ అంశాన్ని ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తూ టీవోఆర్ ఇస్తామని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ఈ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరారు. ఈ మొత్తం ప్రక్రియకు మూడేళ్లు పట్టింది. 2023 అక్టోబర్ లో కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. అది కూడా తమ ఘనతేనని చెప్పుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి తప్పుడు వాదనలతో ప్రజలను పక్కదోవ ప్రయత్నం చేసింది. కానీ వారి ప్రయత్నం కొన్ని రోజుల్లోనే బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. కేఆర్‌ఎంబీ మీటింగ్ సాక్షిగా సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రుల వాదన రాజకీయ ఆరోపణలే తప్ప వాస్తవం కాదని ఇరిగేషన్ సెక్రటరీ చెప్పిన అంశాల ఆధారంగా తేటతెల్లం అయ్యింది.