దళిత మంత్రికి ఘోర అవమానం
మంత్రిని ఆహ్వానించకుండానే ఉస్మానియాపై సీఎం రివ్యూ
దళిత మంత్రికి ఘోర అవమానం జరిగింది. మంత్రికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లోనే ఉన్నా మర్యాద కోసమైనా ఆయనను సమావేశానికి రావాలని పిలువలేదు. శనివారం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణంపై రివ్యూ చేశారు. గోషామహల్ గ్రౌండ్స్ లో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఈనెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే దామోదర కొనసాగారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా హస్తం పార్టీ జెండా మోశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఒకరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ నిర్మించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న బిల్డింగ్ హెరిటేజ్ స్ట్రక్షర్ కావడంతో దానిని సంరక్షించాలని కోరుతూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
పోలీస్ శాఖ అధీనంలో ఉన్న స్థలం బదలాయింపు సహా ఇతర ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంత కీలకమైన సమావేశానికి మంత్రిని ఎందుకు పిలువలేదన్న చర్చ సెక్రటేరియట్‌తో పాటు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన సమావేశం గురించి మంత్రి పేషి ఆరా తీయగా.. ఇది ఓన్లీ ఆఫీసర్స్ మీటింగ్ అని సీఎంవో నుంచి సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ భవన నిర్మాణానికి టెండర్లు పిలవాల్సింది, భవనం నిర్మించాల్సింది ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్. సంబంధిత శాఖ మంత్రికి కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఉన్న మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ సమావేశానికి ఆహ్వానం లేదని తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ భవన నిర్మాణం అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమే తప్ప.. సీఎం సొంత వ్యవహారం కాదు. ప్రభుత్వం అన్నప్పుడు ఏ నిర్ణయమైనా కేబినెట్ కలెక్టివ్‌గా తీసుకోవాలి. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు సంబంధిత శాఖ మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రభుత్వం అంటేనే తాను అన్నట్టుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.