తెలంగాణకే దిక్కులేదు.. ఢిల్లీ కాంగ్రెస్ హామీలకు రేవంత్ గ్యారంటీనా!?
అంత సీనే ఉంటే 13 నెల్లుగా మంత్రివర్గ విస్తరణ లేదెందుకు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని వెదుక్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందట నవ్వుల పాలయ్యే ప్రయత్నాలు మానడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు. ఆ గ్యారంటీల అమలుకు తనది గ్యారంటీ అని కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో గ్యారంటీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేదు. అలాంటిది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే హస్తం పార్టీ అక్కడ గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇవ్వడం అంటే హాస్యాస్పదం కాకుండా ఇంకేమిటి? కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. తమ పార్టీని గెలిపించిన వంద రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం. 13 నెలలు గడిచినా అతీగతీ లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీ పాక్షికంగా అమలు చేస్తున్నారు.
రైతుభరోసాగా ప్రకటించిన రెండో గ్యారంటీ కింద ఏటా ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, వరి పంటకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు యేటా రూ.12 వేల సాయం అనే హామీలిచ్చారు. కేసీఆర్ హయాంలో ఒక్కో సీజన్ కు ఒక్కో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇచ్చే రైతుబంధు సాయాన్ని ఎగవేశారు. రైతుభరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించి జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. అది పంట సాగు చేసిన రైతులకేనని షరతు పెట్టారు. కౌలు రైతుల ముచ్చటే లేదు. బోనస్ ను సన్నవడ్లకే పరిమితం చేశారు. మూడో గ్యారంటీ ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ పాక్షికంగా అమలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు నాలుగో గ్యారంటీ ఇంకా ఈ పథకం పట్టాలెక్కలేదు. యువ వికాసం అనే గ్యారంటీని విజయవంతంగా తుంగలో తొక్కేశారు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న ఆసరా పింఛన్ పేరును చేయూతగా మార్చి నెలకు రూ.4 వేలకు పెంచి ఇస్తామని ఆరో గ్యారంటీని అటకెక్కించారు. గ్యారంటీల్లో ప్రకటించకుండా రాహుల్ గాంధీతో ఇప్పించిన ఇంకో గ్యారంటీ కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. ఈ హామీ కలగానే మిగిలిపోయింది. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి తుది దశలో ఉన్న ఉద్యోగాల భర్తీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఒక్క భారీ ఉద్యోగ నియామక ప్రకటనే విడుదల చేయలేదు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే.. ఆయనకు కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలెవరూ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. హైడ్రా పేరుతో సాగించిన విధ్వంసకాండనే ఇందుకు కారణమని ఢిల్లీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. రేవంత్ పాలనపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా కనీసం కేబినెట్ విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెప్తున్నారు. 13 నెలల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఈ సమావేశానికి రాహుల్ దూతగా కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు.. అంటే ఆయన ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? రేవంత్ వ్యవహారశైలి పార్టీకి చేటు చేస్తుందని రాహుల్ చెప్తున్నట్టే కదా?!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించాలని మొదట ప్రతిపాదించింది రేవంత్ రెడ్డినే. కానీ అప్పుడు ఆ నియామకం జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి మహేశ్ కుమార్ గౌడ్ లాయల్. అలాంటి వ్యక్తి రేవంత్ హోల్డ్ లో ఉండటం మంచిది కాదని పార్టీ హైకమాండ్ భావించింది. అందుకే నేరుగా పార్టీ ముఖ్య నేతలు మహేశ్ తో చర్చలు జరిపి.. పార్టీ లైన్ లో మాత్రమే పని చేయాలని దిశానిర్దేశం చేసిన తర్వాతే ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ సీనియర్ నేతను కదిలించినా ఈ విషయం చెప్తారు. తాను సీఎంగా ఉన్న సొంత రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డికి పూర్తిగా పాలనపై, పార్టీపై పట్టు లేదని కాంగ్రెస్ హైకమాండ్ అంచనాకు వచ్చింది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలను ఇప్పటికిప్పుడు డిస్ట్రర్బ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ లేదనే చెప్తున్నారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆ రోజు వస్తే జరగాల్సిన లాంఛనాలు జరిగిపోతాయని కాంగ్రెస్ ముఖ్యులు బలంగానే చెప్తున్నారు. తన రాష్ట్రంలో తనకే గ్యారంటీ ఉంటుందో లేదో తెలియని తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రజలకు గ్యారంటీ ఇస్తానని గ్యారంటీ ఇవ్వడమే హాస్యాస్పదం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి ఇలాంటి చిత్రవిచిత్ర విన్యాసాలే చేసి చివరికి ఒక్క సీటును గెలిపించలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతకన్నా గొప్ప ఫలితాలు వస్తాయని విశ్లేకులు అంచనా వేయడం లేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మధ్య జరుగుతున్న పోరు మాత్రమేనని అంచనా వేస్తున్నారు. అందుకే ఇండియా కూటమిలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు. అన్ని సర్వేలు కూడా ఆప్ వర్సెస్ బీజేపీనే క్షేత్రంలో తలపడుతున్నాయని చెప్తున్నాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రజలను ఎలాగైనా మెప్పించి గ్యారంటీ మంత్ర ఎత్తుకుంది. కానీ గ్యారంటీలకు కాలం చెల్లిపోయింది. కర్నాటక, తెలంగాణ ప్రజల అనుభవాలు ఇదే చెప్తున్నాయి. కర్నాటకలో ఐదు గ్యారంటీలతో గెలిచిన ఊపులో తెలంగాణలోనూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు విశ్వసించలేదు. రాహుల్ గాంధీ తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకొని నరేంద్రమోదీకి తానే ప్రత్యామ్నాయం అని ప్రజలకు నమ్మకం కలిగించాలంటే మరింత బలంగా పని చేయాలి. కానీ హర్యానాలో పొత్తు ప్రతిపాదిన తెచ్చినా ఆప్ ను పట్టించుకోకుండా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మహారాష్ట్రలో చావుదెబ్బ తిన్నారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఇండియా కూటమి ఉనికికే ముప్పుతెచ్చారు. రేవంత్ నాయకత్వం పట్ల రాహుల్ గాంధీకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా పూర్తి కేబినెట్ ను ఏర్పాటు చేసుకోలేని.. ప్రతి నిర్ణయానికి ఢిల్లీపై డిపెండ్ అవుతున్న బలహీన ముఖ్యమంత్రి రేవంత్ అన్న అపప్రద రాకుండా చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు దీనిపై చర్చ లేదేమో.. రేపుమాపు కచ్చితంగా ఇదే చర్చనీయాంశం అయి తీరుతుంది. అదే జరిగితే రేవంత్ కు వచ్చేనష్టమేమి ఉండకపోవచ్చు.. ఆయన లైఫ్ గోల్ రీచ్ అయ్యాడు. నిండా మునిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే!