కొండన్నకే ఎదురు చెప్తవా.. కీలక అధికారికి సీఎం సోదరుడి దమ్కీ
రాయలసీమ ఇంజనీర్ కు మున్సిపల్ శాఖలో కీలక పోస్టింగ్ వెనుక కొండల్ రెడ్డి?
పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ).. మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని నిర్మాణాలను పర్యవేక్షించే కీలక పోస్టు. ఈ స్థానంలో ఉన్న దేవానంద్ డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ పోస్టు కోసం కొందరు తెలంగాణ ఇంజనీర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్లెవరికీ చాన్స్ దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అన్న అండదండలతో రాయలసీమకు చెందిన భాస్కర్ రెడ్డినే అనే ఎస్‌ఈకి ఈఎన్సీ పోస్టు దక్కింది. సదరు ఎస్‌ఈపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. ఆయనకు అంత కీలకమైన పోస్టింగ్ ఇవ్వడం సరికాదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసే కీలక అధికారి సీఎం అన్నకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతే కొండన్న (రేవంత్ రెడ్డి అన్న)కు కోపం వచ్చింది.. సదరు కీలక అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. పట్టరాని ఆవేశంతో ఊగిపోయారు.. కొండన్నకే ఎదురు చెప్తవా.. నీ పోస్టు ఊడుద్ది అని హుకుం జారీ చేశారు. పాపం సదరు కీలకాధికారి చేసేదేం లేక భాస్కర్ రెడ్డిని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవో కాపీ చేతికి అందగానే భాస్కర్ రెడ్డి ఎంఏయూడీ క్యాంపస్‌లోని పబ్లిక్ హెల్త్ ఆఫీస్ లో ఈఎన్సీగా చార్జ్ తీసుకున్నారు. సీఎం అన్న అండదండలు పుష్కలంగా ఉన్న భాస్కర్ రెడ్డికి మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఏకంగా ఐదు పోస్టులు ఉన్నాయి. అంటే సీఎం స్వయంగా చూస్తున్న మున్సిపల్ శాఖలో సీఎం అన్న హవా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
జీహెచ్‌ఎంసీలో స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ) సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పని చేసే ఎస్. భాస్కర్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీలోనే మెయింటనెన్స్, హౌసింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రాజెక్ట్స్ సీఈతో పాటు పబ్లిక్ హెల్త్ ఈఎన్సీగా పని చేసే దేవానంద్ డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. దేవానంద్ రిటైర్ అయిన వెంటనే ఆయన అప్పటి వరకు పర్యవేక్షించిన ప్రాజెక్ట్స్ సీఈ పోస్టు దక్కించుకున్న భాస్కర్ రెడ్డి ఆ తర్వాత అత్యంత కీలకమైన పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ పోస్టుపై కన్నేశారు. సీఎం అన్న ఆశీస్సులతో ఈఎన్సీ పోస్టును దక్కించుకునేందుకు పావులు కదిపారు. భాస్కర్ రెడ్డికి ఆ పోస్టు ఇవ్వడానికి సీనియర్ అధికారి ఒకరు ససేమిరా అన్నారు. జీహెచ్‌ఎంసీలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డికి ఈఎన్సీ పోస్ట్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. సదరు అధికారిని ప్రసన్నం చేసుకోవడానికి భాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే ప్రయత్నించారు. అయినా ఆ అధికారికి నో చెప్పినట్టుగా తెలిసింది. దీంతో సీఎం సోదరుడి దగ్గరికి వెళ్లి తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని చెప్పుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సీఎం సోదరుడు సదరు అధికారికి ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. తనకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయొద్దని దమ్కీ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి తన మనిషి అని.. ఈఎన్సీగా నియమిస్తూ జీవో ఇచ్చేయమని హుకుం జారీ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సదరు ఉన్నతాధికారి భాస్కర్ రెడ్డికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సెక్రటేరియట్ తో పాటు ఎంఏయూడీ క్యాంప్లెక్స్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ఇంజనీర్లను పక్కన పెట్టి సీఎం సోదరుడు రాయలసీమ ఇంజనీర్ కు మద్దతునివ్వడం ఏమిటి.. ఆయన కోసం ఒక దళిత అధికారికి దమ్కీ ఇవ్వడం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు. పరిపాలనలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని.. దానికి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ నియామకం మరో ఉదారహణ అని అధికారులు చెప్తున్నారు.
భాస్కర్ రెడ్డిని ఈఎన్సీగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.teluguglobal.com/pdf_upload/go-17-dt-10125-1393642.pdf