మహాకుంభమేళాకు వేళాయే

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు మహాకుంభమేళా

Advertisement
Update:2025-01-06 10:22 IST

మహాకుంభమేళాపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తులు ఎదురుచూస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు మహాకుంభమేళ జరగనున్నది. అందులో ఆరు రోజులను ముఖ్యమైనవిగా భావిస్తారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13న పుష్యపూర్ణిమ రోజు మహాకుంభమేళ ప్రారంభం కానున్నది. వచ్చే నెల 26 మహాశివరాత్రి వరకు సాగనున్నది. గంగా, యమున, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ప్రయాగ్‌ రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, భక్తులు, పర్యాటకులు ఉత్తర్‌ప్రదేశ్‌కు క్యూ కడుతున్నారు.45 రోజుల పాటు మహాకుంభమేళా జరగనున్నప్పటికీ అందులో ఆరు రోజులను పవిత్రంగా భావిస్తారు.

అందులో మొదటిది కుంభమేళా ప్రారంభం కానున్న జనవరి 13. ఆ రోజు పుష్య పౌర్ణమి. హిందూ క్యాలెండర్‌ ప్రకారం పుష్య మాసంలో శుక్లపక్షం 15 రోజున పుష్యపూర్ణిమ వస్తుంది. ఆరోజున చంద్రుడు నిండు ఆకారంలో ఉంటాడు. దీనిని మహాకుంభమేళాకు అనధికార ప్రారంభంగా చెబుతారు. ఇదేరోజున కల్పవ కాలం ప్రారంభంగా కూడా చెబుతారు.ఈ రోజులన అధిక సంఖ్యలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. మహాకుంభమేళాలో రెండో ముఖ్యమైన తేదీ జనవరి 14 మకర సంక్రాంతి. హిందు క్యాలెండర్‌ ప్రకారం సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థితికి వెళ్తాడు. మహాకుంభమేళాలో ఈరోజును ఆరంభంగా చెబుతారు. ఇదే రోజును మొదటి రాజస్నానంగా పేర్కొంటారు. భక్తులు తమకు తోచిన విధంగా ఈ రోజు దానధర్మాలు చేస్తారు.

మహా కుంభమేళాలో మూడో కీలకమైన రోజు జనవరి 29 మౌని అమావాస్య. త్రివేణి సంఘమంలో ఇదే రోజు రిషభ్‌ దేవ్‌ అనే రుషి మౌన వ్రతం వీడి పుణ్యస్నానం చసిన తొలి రుషి గా చెబుతారు. మౌని అమావాస్యరోజున భారీ ఎత్తున భక్తులు మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇదే రోజును రెండో రాజ స్నానంగా పేర్కొంటారు. మహాకుంభమేళాలో నాలుగో ముఖ్యమైన తేదీ ఫిబ్రవరి 3 వసంత పంచమి. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజును జ్ఞాన దేవత సరస్వతి ఆగమనంగా, కాల మార్పునకు చిహ్నంగా చెబుతారు.ఇదే రోజును మూడో రాజస్నానంగా పిలుస్తారు. ఈ రోజును పురస్కరించుకుని కల్పవాసీలుగా పేర్కొనే భక్తులు పసుపు దుస్తులు ధరిస్తారు. మహాకుంభమేళాలో ఈరోజున భక్తులు భారీ ఎత్తున హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మహా కుంభమేళాలో ఐదో ముఖ్యమైన రోజు ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ. గంధర్వుడు ఈరోజున స్వర్గం నుంచి త్రివేణి సంగమానికి వస్తారని చెబుతారు. మాఘ పూర్ణిమ రోజున అన్నిఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. మహా కుంభమేళాలో చివరి పవిత్రమైన రోజు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి. ఇదే రోజున కుంభమేళా ముగుస్తుంది. శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే ఈరోజున భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మహాకుంభమేళాలో కీలకమైన ఆరు రోజుల్లో నాగ సాధువులు మొదట పుణ్యస్నానం చేస్తారు. అనంతరం మిగతా భక్తులు ఆచరిస్తారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో మునిగి తేలితే పాపాలు తొలిగిపోతాయని నమ్ముతారు. 

Tags:    
Advertisement

Similar News