ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం పోటాపోటీ
అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ. బీఆర్ఎస్ అభ్యర్థిపై తుది నిర్ణయం కేసీఆర్ దే.. కాంగ్రెస్ లోనే కన్ఫ్యూజన్
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా నెలకొన్నది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత జీవన్‌రెడ్డి పదవీ కాలం మార్చి చివరి నాటికి ముగియనున్నది. ఈ స్థానానికి ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించగా.. మిగిలిన పార్టీలు ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేయనని ప్రకటించడంతో ఆయన స్థానంలో మరో సమర్థ అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది నాయకులు అధికారపార్టీ తరఫున పట్టభద్రుల స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఈ హస్తినకు వెళ్లి అధిష్ఠానం వద్ద తమ అభీష్టాన్ని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌రావు, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డీఎస్పీ గంగాధర్, పోటీ పరీక్షల నిపుణుడు ప్రసన్న హరికృష్ణ గౌడ్, ముస్కు రమణా రెడ్డిలు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. అయితే వీరిలో నరేందర్ రెడ్డి పోటీ చేయడాని నిశ్చయించుకుని సొంతంగా ఓటర్ నమోదు చేయించారు. ముస్కు రమణా రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ గౌడ్ టికెట్ రేస్ నుంచి తప్పుకుని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు.
బీఆర్‌ఎస్, బీజేపీకి అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. దీంతో ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎన్నికైనందున అభ్యర్థి ఎంపికను ఆయా జిల్లాల మంత్రులకు రాష్ట్ర నాయకత్వం అప్పగించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని నిలబెట్టినా విజయావకాశాలు తమకే ఉంటాయని అధికారపార్టీ అంచనా వేస్తున్నది. అయితే నరేందర్‌రెడ్డి మినహా ఎవరిని పోటీలో నిలబెట్టినా కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితమే రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేవని అంటున్నారు. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ బృందం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం తర్వాతనే అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నది. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే పనిలో మంత్రుల బృందం ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా రేవంత్ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందనే భావన నిరుద్యోగుల్లో ఉన్నది. ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నా వాటిలో 90శాతం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయనే అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధించినా జీవన్‌రెడ్డికై పట్టభద్రులు జై కొట్టారు. ఈసారి ఆయన పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని చెబున్నారు. అయితే ఆయన భారీ మెజారిటీకి దోహదపడిన నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్న చేస్తున్నారు. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి.
బీఆర్‌ఎస్ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయవంతమైంది. అలాగే ఈ నాలుగు జిల్లాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. ప్రస్తుతం మిగిలిన అన్ని పార్టీలకంటే బీఆర్‌ఎస్సే బలంగా ఉన్నది. దీంతో ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం డాక్టర్ బీఎన్‌రావు, సర్దార్ రవీందర్ సింగ్, రాజారాం యాదవ్ పోటీ పడుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆశిస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్లు, నిరుద్యోగుల డిమాండ్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు అసెంబ్లీలోనూ, ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా ఓటర్లుగా ఉంటారు. వాళ్లలో ఎక్కువశాతం మంది ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే భావన ప్రభుత్వ టీచర్లలో ఉన్నది. దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయంపై ఆపార్టీ ధీమాగా ఉన్నది.
బీజేపీ కూడా ఈ స్థానంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలను ఆదేశించింది. దీంతో ఈ పట్టభద్రుల స్థానానికి బీజేపీ సినియర్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాని కార్యదర్శి సుగుణాకర్ రావు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒకవైపు ఓటర్లను నమోదు చేపిస్తూ తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ నేతలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని అవకాశం కల్పించాలని కోరారు. అయితే చివరికి వారి ఆశలపై నీళ్లు చల్లింది. మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన సి అంజిరెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన భార్య గోదావరి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అందుకే అధిష్ఠాన అంజిరెడ్డి వైపు మొగ్గు చూపింది. పార్టీల పరంగా చూస్తే అధికారపార్టీ కంటే బీఆర్‌ఎస్ బలంగా ఉన్నది. బీజేపీ ప్రభావం ఎంత ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది.