కాంగ్రెస్ కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.1,351 కోట్ల విరాళాలు
340 సంస్థల నుంచి విరాళాలు సేకరించిన హస్తం పార్టీ
ఫార్ములా -ఈ కేసులో అక్రమాలు జరిగాయని చెప్పే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సెల్ఫ్ గోల్ చేసుకుంది. గ్రీన్ కో, దాని సబ్సిడరీ సంస్థల నుంచి బీఆర్‌ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.41 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్తూ సీఎంవో నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు ఇచ్చింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో పోస్టర్ల రూపంలో విస్తృత ప్రచారం మొదలు పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం సీఎంవో నుంచి లీక్ అందగానే బ్రేకింగ్ ప్లేట్లతో హడావిడి చేసింది. ఏదైనా రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పారిశ్రామికవేత్తలు, సంస్థలు విరాళాలు ఇవ్వడం రహస్యమేమి కాదు. సదరు సంస్థ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ లో ఆ ఏడాదిలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు, కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను విధిగా ప్రకటిస్తాయి. రాజకీయ పార్టీలు ఒక ఆర్థిక సంవత్సరంలో తమకు వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ అదే ఏడాది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తాయి. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోనే ఉంటాయి. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వివరాలను సీఎంవో నుంచి మీడియా లీక్ రూపంలో ఇచ్చి హడావిడి చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.1,351 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ వివరాలన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి.
ఫార్ములా -ఈ రేసుకు గ్రీన్ స్పాన్సర్ మాత్రమే.. రేసు నిర్వహణకు ఆర్థిక తోడ్పాటునివ్వడం ద్వారా తమ సంస్థకు పబ్లిసిటీ వస్తుందని ఆశించింది. స్పోర్ట్స్, కల్చరల్, స్పిర్చువల్ ఈవెంట్స్ కు కార్పొరేట్ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించడం సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు కార్పొరేట్ సోషల్ రెస్పారెన్సిబులిటీ కింద విరాళాలు ఇవ్వాలని వివిధ సంస్థలను కోరుతోంది. సినిమా నిర్మాణ సంస్థలు, హీరోలు, ఇతర నటులు కూడా ఇందులో భాగం కావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి సింగరేణి సంస్థ సహకారంతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. రేపు ఇంకేదైనా కార్యక్రమం తలపెట్టినా ఇదే తరహాలో విరాళాలు ఆహ్వానిస్తుంది. ఇందులో తప్పేమి లేదు. పన్ను మినహాయింపులు ఉంటాయి కాబట్టి విరాళాలు ఇచ్చేందుకు సంస్థలు కూడా ఏమాత్రం వెనుకాడవు. ఇదే క్రమంలో గ్రీన్ కో బీఆర్‌ఎస్ పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. ఇతర సంస్థలు కూడా కొన్నాయి. ఫార్ములా -ఈ రేసు సెకండ్ సీజన్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడంతోనే హెచ్‌ఎండీఏ ఎకౌంట్ నుంచి రేసు నిర్వహణ కోసం ఎఫ్‌ఐఏకు నిధులు బదిలీ చేశారు. ఇందులో నిబంధనలు పాటించలేదని చెప్తూ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఫార్ములా -ఈ కేసులో విచారణకు రావాలని కోరుతూ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. లాయర్ తో పాటు విచారణకు వెళ్లడానికి ప్రయత్నించిన కేటీఆర్‌ను ఏసీబీ అనుమతించలేదు. వ్యక్తిగతంగానే హాజరు కావాలని కోరడంతో కేటీఆర్ అందుకు నిరాకరించారు. విచారణకు అడ్వొకేట్‌తో కలిసే హాజరవుతానని లిఖిత పూర్వకంగా ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దీంతో గ్రీన్ కో నుంచి బీఆర్‌ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లంచాలు ఇచ్చారనే తరహాలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం మొదలు పెట్టింది. అదేదో రహస్యాన్ని తాము బయట పెట్టామని కాసేపు కలరింగ్ ఇచ్చుకుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని వివరాలు వచ్చాయనే వివరాలను ఆ కాసేపటికే బీఆర్‌ఎస్ లెక్కలతో సహా బయట పెట్టింది. దీంతో సీఎంవో నుంచి ఇచ్చిన లీక్ కు అంతగా ప్రాధాన్యత లేదన్న విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆలస్యంగా గుర్తించింది. కాంగ్రెస్ పార్టీకి 340 సంస్థల నుంచి 1,351 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. అందులో అనేక సంస్థలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు చేస్తున్నాయి. అంటే ఆ విరాళాలపై ఏసీబీ విచారణకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా? కాంగ్రెస్ కు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి కాబట్ట ఏఐసీసీ చీఫ్‌గా ఉన్న మల్లికార్జున ఖర్గేను విచారిస్తారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. వ్యాపారాలు చేసుకునే అనేక సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం సహజం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కువ విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ సహా ప్రతి రాజకీయ పార్టీకి వివిధ సంస్థలు విరాళాలు ఇచ్చాయి. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి జరిగిందే తప్ప ఇందులో ఏమాత్రం చీకటి కోణం లేదు. అయినా ఏదో ఒకరకంగా బుదర జల్లాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో లీకులు ఇచ్చి బొక్కబోర్లా పడింది.
కాంగ్రెస్ పార్టీకి వివిధ సంస్థలు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి
https://www.teluguglobal.com/pdf_upload/inc-companies-1391986.pdf