కాంగ్రెస్‌, బీజేపీ ప్రత్యర్థులా? స్నేహితులా?

కొంతకాలంగా అనేక అంశాలపై రాజకీయంగా ఇరు పార్టీల వైఖరి ఒకేలా

Advertisement
Update:2025-01-09 08:08 IST

కేంద్రంలో ఉప్పు-నిప్పులా ఉండే కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణ లో కలిసే పనిచేస్తున్నాయా? బీజేపీపై కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం వైఖరి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం దానికి విరుద్ధంగా రేవంత్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్నదా? అంటే ఔననే సమాధానం వినిపిస్తున్నది. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్ధులు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. సీట్లు తక్కువగా వచ్చినా కాంగ్రెస్‌ పార్టీకే ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్నది. బీజేపీ దేశమంతా గెలుస్తున్నా తెలంగాణకు వచ్చే సరికి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ లోపాయీకారీ ఒప్పందానికి వచ్చినట్టు రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పైకి కాంగ్రెస్‌, బీజేపీ భిన్న ధ్రువాలుగా కనిపిస్తున్నా ఈ రెండు పార్టీల టార్గెట్‌ బీఆర్‌ఎస్‌. ముఖ్యంగా కేసీఆర్‌ ను రాజకీయంగా బలహీనపరచాలి. తద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది బీజేపీ ప్లాన్‌. ఈ క్రమంలోనే కవితను అరెస్ట్ చేసి జైలు కు పంపింది. ఫార్ములా -ఈ రేసు పేరుతో కేటీఆర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డికి అవసరమైన తెరచాటు సాయం చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యాఖ్యలు ఒకే ఉండడం ఆరోపణలకు బలాన్ని ఇస్తుంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు జడ్జిమెంట్లు ఇచ్చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

న్యాయస్థానాలపై గౌరవం ఉన్నది, ఫార్ములా ఈ-రేస్‌ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని కేటీఆర్‌ చెబుతున్నారు. అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం స్పందించలేదు. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌ తదుపరి కార్యాచరణపై మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలపై ప్రజల్లోనూ కొంత అసంతృప్తి వ్యక్తమౌతున్నది. కొంతమంది రాజకీయ, దర్యాప్తు సంస్థల్లో పనిచేసిన వాళ్లు కూడా ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది అంటున్నారు. కోర్టులో జరగాల్సిన విచారణలను కాంగ్రెస్‌ మంత్రులే శిక్షల గురించి మాట్లాడుతుండగా.. బీజేపీ నేతలూ అదే విధంగా మాట్లాడటం గమనార్హం. అంటే రాజకీయంగా భిన్నమైన సిద్ధాంతాలు అయినా బీఆర్‌ఎస్‌ను బలహీనపరచడానికి నాకు నువ్వు నీకు నేను అన్నట్టు నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. తద్వారా బీఆర్‌ఎస్‌ రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆరాటపడుతున్నట్టు వాళ్ల వ్యవహారం ఉన్నది.

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్‌ బిదూరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నిన్న నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.. మాటామాట పెరిగి రాళ్లు, కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. మంగళవారం ఉదయం నుంచి ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారం వార్తల్లో ఉండగా.. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ అంశం హటాత్తుగా తెరమీదికి వచ్చింది. రాత్రి వరకు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతల చర్యలను సీఎం , డీప్యూటీ సీఎం ఖండించారు. మరి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం లేకుండా బీజేపీ స్టేట్‌ ఆఫీసు ముట్టడికి ఎలా వెళ్తారు? అలాగే ప్రియాంక పై బీజేపీ నేత వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఖండించారు. మరి ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది ? ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అది పైకి మాత్రమే. లోలోపల మాత్రం ఆ రెండు పార్టీల లక్ష్యం బీఆర్‌ఎస్‌ రాజకీయంగా బలహీనపరచడం అన్నది ఇటీవల ఆ రెండు పార్టీల కార్యాచరణ, నేతల కామెంట్లు చూస్తే తెలిసిపోతున్నది.

Tags:    
Advertisement

Similar News