సీఎం ఆదేశాలా.. డోంట్‌ కేర్‌!

సొంత నియోజకవర్గంలో రోడ్లకు నిధులు విడుదల చేయని ఆఫీసర్లు

Advertisement
Update:2024-11-17 17:08 IST

తెలుగు గ్లోబల్‌ ఎక్స్‌క్లూజివ్‌


తెలంగాణాకు తానే పదేళ్లు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న రేవంత్‌ రెడ్డిని ఆఫీసర్లు లైట్‌ తీసుకుంటున్నారా? తన సొంత నియోజకవర్గానికి నిధులు విడుదల చేయాలని చెప్పినా డోంట్‌ కేర్‌ అంటున్నారా? ముఖ్యమంత్రి ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెడుతున్నారా? పాలన యంత్రాంగం ఎందుకు సీఎంను ఇగ్నోర్‌ చేస్తోంది? అనే ప్రశ్నలకు సెక్రటేరియట్‌లో రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. తాను సీఎం అయ్యాక కూడా కొడంగల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే అది తన వైఫ్యలమే అవుతుందని సీఎం బాహాటంగానే చెప్తున్నారు. ఇప్పటికీ కనీసం రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, తండాలకు రోడ్లు వేయిస్తానని ఇటీవల హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు అవసరం, బ్రిడ్జిలు ఏమైనా అవసరమవుతాయా అనే దానిపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ హామీ ఇచ్చిన తర్వాత గ్రామీణ రోడ్ల సంగతి ఎంతవరకు వచ్చిందనే దానిపై సీఎం దృష్టి సారించలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు, వయనాడ్‌ లోక్‌సభకు ఉప ఎన్నిక, ఢిల్లీ పర్యటనలు, ఇతరత్రా పనుల్లో సీఎం బిజీ అయ్యారు. ముఖ్యమంత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో రోడ్ల మంజూరు గురించి హామీ ఇచ్చారు కదా? అది ఎంతవరకు వచ్చిందని సీఎంవోలోని ఒక అధికారి ఆర్థిక శాఖ ఉన్నతాధికారికి ఫోన్‌ చేస్తే సీఎంవో సెక్రటరీపై సదరు ఉన్నతాధికారికి ఫైర్‌ అయ్యారట.. తనకు ఫోన్‌ చేసే స్థాయి లేదని సీఎంవో అధికారిపై మండిపడ్డారట!

కొడంగల్‌ నియోజవర్గంలోని అన్నిగ్రామాలకు తారు రోడ్లు మంజూరు చేయాలని సీఎం కొన్ని రోజుల క్రితం ఆదేశించారు. కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీతో పాటు పంచాయతీరాజ్‌ శాఖ కో ఆర్డినేషన్‌తో పని చేసి ఆయా రోడ్లకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయడం, సాంక్షన్లు ఇవ్వడం, నిధులు మంజూరు చేయడం, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ తదితర పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆ పనులను ఫాలో అప్‌ చేసి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ చేయాలని సీఎంవోలోని ఒక ఉన్నతాదికారికి సీఎం సూచించారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం రోడ్లకు అవసరమైన ప్రపోజల్స్‌ సిద్ధం చేయడం సహా పలు పనులు చేసినా, అడ్మినిస్ట్రేటివ్‌ సైడ్ నుంచి సపోర్ట్‌ దక్కడం లేదని చెప్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సన్నిహితురాలైనా ఆమె కూడా కొడంగల్‌ రోడ్లకు అవసరమైన నిధుల మంజూరు సహా ఇతర అంశాలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. దీంతో సీఎంవోలోని ఉన్నతాధికారి పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌ లో మాట్లాడటం.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆయన ఫోన్‌ ను లైట్‌ తీసుకోవడం పరిపాటిగా మారిపోయిందని చెప్తున్నారు. విషయంలో సీరియస్‌నెస్‌ ఉంటే ప్రొటోకాల్‌ ప్రకారం సీఎంవోలోని మరో ఉన్నతాధికారి కదా తనకు దాన్ని కన్వే చేయాల్సింది అని కూడా ఆర్థిక ఉన్నతాధికారి చెప్పారట. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో సీఎంవోలోని సదరు అధికారి ఉన్నారని సమాచారం.

ఒక్క కొడంగల్‌ రోడ్లే కాదు.. అనేక అంశాల్లో సీఎం ఆదేశాలు ఇవ్వడం ఆ తర్వాత అవి ఏమయ్యాయో కూడా తెలియడం లేదని సీఎంవో, సెక్రటేరియట్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో అన్ని శాఖలపై రివ్యూ చేశారు. ఆయా సమీక్ష సమావేశాల్లో అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. వాటిని ప్రయార్టైజ్‌ చేసి తప్పనిసరిగా చేయాల్సిన పనులపై మరోసారి సమీక్షించడమో.. అధికారులకు ఆదేశాలు ఇవ్వడమో చేయాలి.. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నాలేవి జరగడం లేదని చెప్తున్నారు. అందుకే సీఎం ఆదేశాల పేరుతో సీఎంవో నుంచి ఉన్నతాధికారులు ఫాలో అప్‌ చేసే అనేక ప్రయత్నాలకు ఆయా శాఖలకు బాస్‌ లుగా ఉన్న సీనియర్‌ అధికారుల నుంచి సహాయ నిరాకరణే ఎదురవుతోందని తెలుస్తోంది. సీఎం ఎప్పుడో తప్ప సెక్రటేరియట్‌ కు రాకపోవడం, వచ్చినా గతంలో ఇచ్చిన ఆదేశాల గురించి పట్టించుకోకుండా కొత్తగా ఆదేశాలు ఇవ్వడంతో గతంలో ఇచ్చిన ఆదేశాలన్నీ మరుగున పడిపోతున్నాయని చెప్తున్నారు. కొన్ని నెలలుగా సీఎం ఇతర రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలు, పార్టీ పరమైన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారని.. దీన్ని ఆసరాగా చేసుకొని రొటీన్‌ గా చేయాల్సిన పనులను కూడా ఉన్నతాధికారులు లైట్‌ తీసుకుంటున్నారని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పాలన మొత్తం గాడి తప్పే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News