అయిపోయిన పెళ్లికి వైసీపీ బాజాలు..
పోనీ పవన్ చేసిన పని నచ్చకపోతే జనసైనికులే తిరుగుబాటు చేస్తారు కదా, అది వైసీపీకి మరింత మేలు చేసే అంశమే కదా..? ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ప్రతిరోజూ వైసీపీ బాజాలు మోగిస్తుండటం ఇక్కడ విశేషం.
అక్రమ పొత్తు, అనైతిక పొత్తు, లాలూచీ పొత్తు, ప్యాకేజీ పొత్తు.. వైసీపీ రకరకాల పేర్లు పెట్టుకున్నా కూడా అక్కడ టీడీపీ-జనసేన పొత్తు ఖరారైపోయింది. కార్యకర్తలకు నచ్చజెప్పుకుంటారో, హెచ్చరించుకుంటారో, కలసి ఉండాలని ఒట్టు వేయించుకుంటారో.. వాళ్ల తంటాలేవో వాళ్లు పడుతున్నారు. మధ్యలో వైసీపీ మాత్రం ఎక్కడలేని ఇదైపోతుంది. టీడీపీ, జనసేన కలయికను ఏపీ ప్రజలు క్షమించరని తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నిజంగా ప్రజలు క్షమించకపోతే అది వైసీపీకి లాభమే కదా. అలా క్షమించకూడదు అనే కదా వీరు కోరుకోవాల్సింది. జగన్ కి లాభం చేకూర్చే పని పవన్ కల్యాణ్ చేస్తే.. వైసీపీ నాయకులు ఆందోళనపడటం దేనికి. పదే పదే ఆ పొత్తు గురించి స్టేట్ మెంట్లివ్వడం ఎందుకు..?
ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావ్ పవన్..? 175 లో చేస్తావా..? 100 తీసుకుంటావా..? 75 తో సరిపెట్టుకుంటావా..? వైసీపీ నుంచి ప్రశ్నలు వినపడుతున్నాయి. పొత్తు పెట్టుకున్నాక టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కచ్చితంగా ఉంటుంది. అయితే ఆ లెక్కేంటో ఇప్పుడే చెప్పండంటూ వైసీపీ డిమాండ్ చెయ్యడమే లాజిక్ లేని విషయం. ఆ లెక్కలతో వీళ్లకేం పని. వైనాట్ 175 అంటూ స్టేట్ మెంట్లిస్తున్నారు కదా... వైరి వర్గం లెక్కలతో వారికెందుకు ఆందోళన..? అంబటి మాత్రమే కాదు, వైసీపీలోని కాపు సామాజిక వర్గం నాయకులంతా ఇటీవల కాలంలో జనసైనికులపై ఎక్కడలేని సింపతీ చూపెడుతున్నారు. జనసైనికుల్ని పవన్, చంద్రబాబుకి తాకట్టు పెట్టారని, ఆయన కాళ్లదగ్గర పెట్టారని అంటున్నారు. పోనీ పవన్ చేసిన పని నచ్చకపోతే జనసైనికులే తిరుగుబాటు చేస్తారు కదా, అది వైసీపీకి మరింత మేలు చేసే అంశమే కదా..? ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ప్రతిరోజూ వైసీపీ బాజాలు మోగిస్తుండటం ఇక్కడ విశేషం.
పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారు..?
తన తల్లిని తిట్టాడని, లోకేష్ ని క్షమించబోనని చెప్పిన పవన్.. ఇప్పుడు టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని తాజాగా అంబటి వ్యాఖ్యానించారు. ఆ మాటకొస్తే వైసీపీలో ఉన్న చాలామంది నేతలు వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ని వ్యతిరేకించినవారే కదా. మంత్రి బొత్స పాత వీడియోలు చూస్తే అంబటి ఈ మాట అనగలరా..? మొత్తమ్మీద ఎన్నికల ఏడాదిలో వైసీపీ టార్గెట్ ఎవరు, ఏంటనేది ఓ క్లారిటీ తెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. వైసీపీ నాయకుల వాలకం చూస్తుంటే.. వాళ్లింకా టీడీపీ-జనసేన పొత్తుల దగ్గరే ఆగిపోయినట్టు అర్థమవుతోంది. పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువగా వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు.
♦