జగన్ కు విజయసాయి రెడ్డి కౌంటర్
వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడినని పేర్కొన్న మాజీ ఎంపీ
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను ఉద్దేశించి గురువారం మీడియా సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై 'ఎక్స్'లో విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ''వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా..'' అని పేర్కొన్నారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో విజయసాయి రెడ్డి సహా నలుగురు పోయారని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని కదా అని జగన్ వ్యాఖ్యానించారు. మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడో అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏమిటీ అని ప్రశ్నించారు. వైసీపీ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నిలదొక్కుకుంది తప్ప ఇలాంటి నేతలతో కాదని చెప్పారు.