మనల్ని ఎవడ్రా ఆపేది..? తొలిరోజే గబ్బర్ సింగ్ పంచ్ డైలాగులు
విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో తానింకా నిర్ణయించుకోలేదని, ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయమని చెప్పుకొచ్చారు పవన్. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు.
వారాహి రోడ్డెక్కగానే పవన్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. యాత్ర తొలిరోజే పంచ్ డైలాగులతో జనసైనికుల్ని ఖుషీ చేశారు పవన్. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు. కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ ఆవేశంగా ప్రసంగించారు. తనపై కక్షగట్టి గాజువాక, భీమవరంలో ఓడించారని, ఈసారి తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు. దమ్ముంటే తనను అడ్డుకోవాలని సీఎం జగన్ కి సవాల్ విసిరారు.
గాజువాకలో తనను గెలిపించి ఉంటే కనీసం రుషికొండనైనా కాపాడేవాడినని చెప్పారు పవన్ కల్యాణ్. మద్యపానాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మద్యంపై ఏటా రూ.25వేల కోట్ల ఆదాయం తెచ్చుకుంటున్నారని విమర్శించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తానని చెప్పి, మధ్యలో జీపీఎస్ తెచ్చారని మండిపడ్డారు. అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీయే కారణమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతిని ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రాజధానిపై కుల ముద్ర వేయటం దారుణమన్నారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు.
పార్టీ ఆఫీస్ కి డబ్బులు ఎక్కడివంటే..?
పార్టీ నడిపేందుకే తాను సినిమాలు చేస్తున్నానని చెప్పిన పవన్, తనపై కక్షతో సినిమాలు కూడా అడ్డుకున్నారని చెప్పారు. సినిమా టికెట్ల విషయంలో కూడా రాజకీయం చేసి దిగజారిపోయిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. తన బిడ్డల కోసం దాచి పెట్టిన నిధితో పార్టీ ఆఫీసు కట్టానన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన బిడ్డలే అనుకున్నానన్నారు.
వైసీపీకి అందరూ భయపడుతున్న వేళ, జనసేన పార్టీ మాత్రమే చెప్పు చూపించి మక్కెలిరొగ్గడతామని హెచ్చరించిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ.. ఒక్క సీటు లేని జనసేనను టార్గెట్ చేసిందంటే వారికి మనమంటే ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు అని జనసైనికుల్ని ఉద్దేశించి అన్నారు. భవిష్యత్‌లో వైసీపీని ఎదుర్కొనేది జనసేన మాత్రమే అన్నారు.
విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో తానింకా నిర్ణయించుకోలేదని, ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయమని చెప్పుకొచ్చారు పవన్. మొత్తం రాజకీయమంతా ఆంధ్రా నుంచే చేస్తానన్నారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని ముక్తాయించారు జనసేనాని.