తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం ఎప్పుడంటే?
జనవరి 5న టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వచ్చే తిరుపతి స్థానికులకు వచ్చే ఏడాది జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7న మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి అబర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొన్నది.