మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తాడేమో?
విచక్షణాధికారం ఉన్నదని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ధ్వజం
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీనిపై ఆమె మండిపడ్డారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తాడేమో. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారు. విచక్షణాధికారం ఉన్నదని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవీరెడ్డి ధ్వజమెత్తారు.
కడపలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 7న కుర్చీ వివాదం నేపథ్యంలో సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కుర్చీ వివాదంపై కడప నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలసులు 144 సెక్షన్ విధించారు.
గత నెల 7న జరిగిన సమావేశంలో మేయర్ ఛాంబర్‌లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిలుచుని నిరసన తెలిపారు. పాలకవర్గం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను అవమానిస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకున్నది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నామని మండిపడ్డారు.