తిరుమలలో అనధికార దుకాణాలపై త్వరలో చర్యలు

తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్న టీటీడీ ఈవో శ్యామలరావు

Advertisement
Update:2024-12-22 15:57 IST

తిరుమలలో ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఆదేశించారన్నారు. ఆలయ పవిత్రను కాపాడేవిధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాం. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించాం. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాం. తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాం. 2047 తిరుమల విజన్‌లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయాలి. దాతలు నిర్మించిన అతిథి గృహాల్లో 20 గృహాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలి. అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్‌ సౌకర్యం పెంచాలి. అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా వెళ్తున్నాం. తిరుమలలో అనధికార దుకాణాల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. లడ్డూ ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నాం. దేశవ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ద్వారా ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది.

పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పార్కింగ్‌ సమస్యలు ఉన్నాయి. ఆకాశగంగ, పాప వినాశనం తీర్థాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆ తీర్థాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ హిందు ధర్మ ప్రచార పరిషత్‌ విభాగంలో లోటుపాట్లు జరిగాయి. ఈ లోటుపాట్లు జరగకుండా ఒక కమిటీని వేస్తున్నాం. గత ఆరు నెలలుగా టీటీడీ విజిలెన్స్‌ అధికారులు బాగా పనిచేస్తున్నారు. దర్శన టికెట్లు ఇస్తామని భక్తులను మోసం చేసే వారిని పట్టుకుంటున్నారని శ్యామలారావు అన్నారు.

Tags:    
Advertisement

Similar News