పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు నుంచి వారాహి పార్ట్-2 మొదలు కాబోతోంది. దీనికి సన్నాహకంగా నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే పొత్తుల గురించి చర్చ వచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదని, వైసీపీ అంతమే తన పంతమని చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే వారాహి యాత్ర పార్ట్-2 మొదలయ్యే నాటికి పవన్ కల్యాణ్, పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల గురించి ఆలోచించడానికి ఇంకా సమయం ఉందని, ఒంటరిగా బరిలో దిగాలా లేక విపక్షాలను కలుపుకొని వెళ్లాలా అనేది తర్వాత మాట్లడదామని చెప్పారు. వారాహి యాత్ర పార్ట్-1 ముగిసిన ప్రాంతాల్లోని నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు పరిశీలకులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు నుంచి వారాహి పార్ట్-2 మొదలు కాబోతోంది. దీనికి సన్నాహకంగా నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే పొత్తుల గురించి చర్చ వచ్చింది. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నాయకులతో చెప్పారు పవన్. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోందని, ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా, అది జనం బాగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు పవన్. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీపై ప్రజాభిమానం ఎక్కువ అని, దాన్ని నాయకులు అందిపుచ్చుకోవాలని చెప్పారు.
పవన్ కల్యాణ్ సింగిల్ గా ఎన్నికలకు వెళ్లేందుకు సాహసం చేయట్లేదు. అలాగని టీడీపీ విదిల్చే సీట్లతో సర్దుకుపోవడం కూడా ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదు. తక్కువ సీట్లు తీసుకుని తృప్తి పడితే సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్యాకేజ్ స్టార్ అంటూ వైసీపీ అంటున్న మాటలు నిజమని అనుకోవాల్సిందే. అందుకే పవన్ తెలివిగా పొత్తులపై దాటవేశారు. నెంబర్ గేమ్ లో తనమాట నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం అంటూ సేఫ్ గేమ్ మొదలు పెట్టారు.