అధికారం నా అంతిమ లక్ష్యం కాదు.. క్లారిటీ లేని పవన్ వ్యాఖ్యలు
అధికారం పరమావధి కాదు, అది నా అంతిమ లక్ష్యం కాదంటున్న పవన్ అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు..? పొత్తులు ఎందుకు, పోటీ ఎందుకు..?
నాకు సీఎం కావాలని లేదు..
నన్ను సీఎం చేయండి..
ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తా ఎవరడ్డొస్తారో చూస్తా..
ఈసారి మీరు నన్ను ఓడించినా గోదావరిలాగా ఇక్కడే ఉంటా..
పవన్ కల్యాణ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతున్నారు. పోనీ రాజకీయ నాయకులంతా ఇంతే కదా అనుకుంటే.. పవన్ మాటల మధ్య పెద్ద గ్యాప్ కూడా లేదు. ఈరోజు ఒకటి అంటే, రేపు ఇంకోటి అంటారు. అందుకే ఆయనకు నిలకడలేదని వైరి వర్గాలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. పదే పదే ఆ విమర్శలకు బలం చేకూర్చేలా పవన్ వ్యాఖ్యలు ఉంటుంటాయి. తాజాగా ఆయన అధికారం తన అంతిమ లక్ష్యం కాదంటూ మరో కన్ఫ్యూజన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
రాజకీయ పార్టీ పెట్టిన వారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి అధికారమే పరమావధి. అధికారంకోసమే పార్టీ పెడతారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు. లేదంటే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రజా సేవ చేస్తారు. మరి అధికారం పరమావధి కాదు, అది నా అంతిమ లక్ష్యం కాదంటున్న పవన్ అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు..? పొత్తులు ఎందుకు, పోటీ ఎందుకు..?
వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో పర్యటించిన పవన్ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అధికారం గురించి మరోసారి మాట్లాడారు. నిబద్ధతతో తాను జనసేన పార్టీ ప్రారంభించానన్నారు పవన్ కల్యాణ్. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన పనిలేదన్నారు. తనకు ఉన్న సామర్థ్యానికి ఏదో ఒక పదవి పొంది ఉండొచ్చని, ఇంతమందితో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదన్నారు.
చేతులెత్తి మొక్కుతా నన్ను గెలిపించండి..
సీఎం జగన్ లాగా తాను అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదని, బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కూడా చెప్పనని అన్నారు పవన్. ఉప కులాల మధ్య ఐక్యత ఉండాలని, సరైన వ్యక్తులను మీరు నమ్మడం లేదని చెప్పారు. సరైన వ్యక్తులపై విశ్వాసం పెట్టండని సూచించారు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండని అభ్యర్థిస్తున్నానంటూ ముక్తాయించారు పవన్.
పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు..
ఓవైపు అధికారం నాకు పరమావధి కాదంటూనే, మరోవైపు చేతులెత్తి మొక్కుతాను నన్ను గెలిపించండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అసలు పవన్ కి క్లారిటీ లేదని మరోసారి వైసీపీ విరుచుకుపడుతోంది.